
అమ్మా.. మొర ఆలకించరూ..
ఫ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన వినతులు
ఫ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితులు
నల్లగొండ : అమ్మా.. మా మొర ఆలచించి.. మా సమస్యను పరిష్కరించండి అంటూ పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రాలు సమర్పించారు. గ్రీవెన్స్‌డేకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువగా పిల్లలు తమను పట్టించుకోవడం లేదని, పింఛన్లు, భూ సమస్యలు, ఉద్యోగాల కోసం వినతులు సమర్పించారు. కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, నారాయణ్ అమిత్, డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి వినతులు స్వీకరించారు.
కలెక్టర్ అసహనం
చార్జీలను పెంచాలని పీఆర్‌పీఎస్ (ప్రజా పోరాట సమితి) అధ్యక్షుడు నూనె వెంకటస్వామి హమాలీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తుండడంతో వినతులు స్వీకరణ కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో అక్కడ కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి వారిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వబోగా అదనపు కలెక్టర్‌కు ఇవ్వాలని సూచించారు. ముఖ్యమైన విషయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నామని.. ఇక్కడ పార్టీలు చేసుకోవడం లేదని.. ఆ సమయంలో నినాదాలు చేయడమేంటి కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.