
వైద్య సేవలపై ఆరా
దేవరకొండ: దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిని బుధవారం ఐపీహెచ్‌ఎస్(ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్) బృందం సందర్శించింది. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రి నిర్వహణపై బృందం సభ్యులు డా.అభిషేక్, రామలక్ష్మి ఆరా తీశారు. ఆస్పత్రిలోని ఇన్‌పేషంట్, అవుట్ పేషెంట్ వార్డులు, ప్రసూతి వార్డు, ఆపరేషన్ థియేటర్, ఫార్మసీ వంటి కీలక విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిరోజు ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చే రోగులు, నమోదవుతున్న ఓపి వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న వైద్య సేవలు, వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, ప్రమాణాలపై సమగ్ర నివేదిక రూపొందించనున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. వారి వెంట సూపరింటెండెంట్ రవిప్రకాశ్, కృష్ణ, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.