
4,037 ఎకరాలకు పట్టాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూభారతి పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిరుమలగిరి (సాగర్) మండలంలో 4,037 ఎకరాలకు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పేదలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చిన్నచిన్న విషయలను సాకుగా చూపించి సమస్యలను జఠిలం చేయవద్దని అటవీశాఖ అధికారులకు సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా సర్వే చేశామన్నారు. ఈ పైలెట్ ప్రాజెక్ట్‌లో 235 సర్వే నంబర్లను ఎంపిక చేసి, 23 వేల ఎకరాల్లో సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. అందులో 12వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించినట్లు తెలిపారు. అందులోనూ 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిల్లో 4 వేల ఎకరాలు పాస్‌పుస్తకాలు కలిగిన రైతులు సాగు చేస్తున్నట్లు గుర్తించినట్లు వివరించారు. మిగిలిన 4,037 ఎకరాలకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందన్నారు. అలాగే ఈ సర్వేలో 2,936 ఎకరాలకు సంబంధించి 3,069 మంది వద్ద బోగస్ పాసు పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి వాటిని రద్దు చేశామని తెలిపారు. వారికి రైతు భరోసా, రైతు బీమా పథకాలను రద్దు చేశామన్నారు. సర్వేలో భాగంగా 7వేల ఎకరాలు అటవీ భూమిని గుర్తించామని, ఈ భూములకు సంబంధించిన వివాదాలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40–50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. అయితే వివిధ నిబంధనలు చూపుతూ ఆ భూములు అటవీశాఖకు చెందినవని అటవీ అధికారులు కొర్రీలు వేస్తున్నారన్నారు. ఈ అంశంపై రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేసి వీలైనంత త్వరగా పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో మాజీ మంత్రి కె.జానారెడ్డి, సాగర్ ఎమ్మెల్యే కె.జయవీర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయిక్, రెవెన్యూ శాఖ సెక్రటరీ డీఎస్.లోకేష్‌కుమార్, పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.
ఫ తిరుమలగిరి సాగర్ మండలంలో త్వరలో పంపిణీకి ఆదేశాలు
ఫ భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో 3069 మంది అనర్హుల గుర్తింపు
ఫ మానవీయ కోణంలో పరిష్కారంచూపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలు