
నాలుగు నెలలుగా వేతనాల్లేవ్..
పెద్దవూర: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 16 ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 3, యాదాద్రి భువనగిరి 1 ఒకటి ఉన్నాయి. 2015 నవంబర్‌లో విద్యార్థులు ఎక్కువ ఉన్న ఆరు గిరిజన వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా కన్వర్ట్ చేశారు. ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన బాగానే ఉన్నప్పటికి ఎలాంటి శాంక్షన్ పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ప్రభుత్వం 2015లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా రూ.5వేల వేతనంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. వేతనాలు పెరుగుతాయన్న ఆశతో ఈ పోస్టులకు ఉన్నత విద్యాభ్యాసం చేసిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వేతనాలు తక్కువగా ఇస్తున్నారని ఆందోళనలు చేయడంతో 2020లో రూ.12వేల వేతనంతో పార్ట్ టైం అని తొలగించి విద్యా వలంటీర్లుగా మార్చారు. ఇదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న సీఆర్‌టీలతో సమానమైన వేతనాలు ఇవ్వాలని పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించగా.. ఇదే పోస్టును 2023లో ఔట్‌సోర్సింగ్‌కు మార్చి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఉపాధ్యాయులుగా నామకరణం చేసి రూ.12వేల వేతనాన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించి రూ.10,440 వేతనం ఇస్తున్నారు. అయినా ఇప్పటివరకు వేతనాలు రాలేదు. నల్లగొండ జిల్లాలో 76 మంది, సూర్యాపేటలో 30 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరుగురు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి గత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలతో పాటు ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెల నుంచి ఆగస్టు వరకు మొత్తం నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో కుటుంబ పోషణ కోసం సెలవు రోజుల్లో కూలి పనులకు వెళ్తున్నట్లు అకడమిక్ ఇన్‌స్ట్రక్లర్లుగా పనిచేస్తున్న వారు చెబుతున్నారు.
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా..
తాము రెగ్యులర్ ఉపాధ్యాయులు, సీఆర్‌టీలతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా చాలీచాలని వేతనాలు ఇస్తున్నారని అకడమిక ఇన్‌స్ట్రక్టర్లు పేర్కొంటున్నారు. కన్వర్ట్ ఆశ్రమ పాఠశాలలు కేవలం అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లతోనే నడుస్తున్నాయని, తమకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఫ అప్పులపాలవుతున్న
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు
ఫ జీతాల కోసం ఉమ్మడి జిల్లాలో
116 మంది ఎదురుచూపు