
ఎండు ఆకు తెగులు.. నివారణ చర్యలు
త్రిపురారం: ఉమ్మడి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి పంటలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్యాక్టీరియా సోకడం వల్ల ఎండు ఆకు తెగులు ఉదృతిని అధికంగా ఉంది. దీంతో రైతులు సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. ఎండాకు తెగులు గుర్తించే పద్ధతులు, నివారణ చర్యలు ఆయన మాటల్లో...
తెగులు సోకడానికి కారణాలు
ఆగస్టు–సెప్టెంబర్ మధ్యలో ఉండే వాతావరణ పరిస్థితులు, మబ్బులతో కూడిన వాతావరణం రెండు నుంచి మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు, తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా వరిలో ఎండాకు తెగులు ఆశించడానికి దోహదం చేస్తాయి. నారు మడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది.
గుర్తించే విధానం
వరి పంటలో ఎండాకు తెగులు సోకిన ప్రదేశంలో ముందుగా ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో గమనించినట్లయితే ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది.
నివారణ చర్యలు
బ్యాక్టీరియా వ్యాప్తి నివారణకు తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 4 గ్రాములు (లేదా) పోషామైసిన్ (లేదా) స్ట్రైప్లోసైక్లిన్ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.

ఎండు ఆకు తెగులు.. నివారణ చర్యలు