
ప్రభుత్వాలు హామీలు అమలు చేయాలి
నల్లగొండ టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. నల్లగొండలో బుధవారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించి రోజువారీ వేతనం రూ.700 ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీల్లో కూడా ఉపాధి హామీ పథకం విస్తరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేసి వ్యవసాయ కార్మిక కుటుంబాలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో లొడంగి శ్రావణ్ కుమార్, బొలుగురి నరసింహ, సీహెచ్ ఉషయ్య, ఎం.వెంగళయ్య, వేముల బుచ్చయ్య, ఎండీ జాన్మియా, ఉప్పునూతల రమేష్ శంకర్‌నాయక్, లాలయ్య, ఇంజమూరు నరసింహ, వల్లపు పెంటయ్య జి పెద్ద నరసింహ, దోటి భిక్షం తదితరులు పాల్గొన్నారు.