
44,099 కార్డులకు తొలిసారిగా..
కొత్త కార్డులు మంజూరు
నల్లగొండ : సెప్టెంబర్ నెలకు సంబందించి సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే 75 శాతం బియ్యం గోదాముల నుంచి రేషన్‌షాపులకు చేరింది. ఈ నెల నుంచి కొత్తగా 44,099 కార్డులకు బియ్యం అందనుంది.
5,550 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
ప్రభుత్వం జూన్‌లోనే మూడు మాసాలకు(జూన్, జూల్, ఆగస్టు) సంబంధించిన బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ పోర్టబులిటీ విధానం అమలులో ఉన్నందున అందుబాటులో ఉన్న షాపుల్లో కార్డుదారులు వేలిముద్ర వేసి బియ్యం తీసుకుంటున్నారు. వారి కార్డు ఉన్న షాపుల్లో బియ్యం కోటా మిగులుతుంది. ఇలా చాలా చోట్ల షాపుల్లో జూన్ నెలలో సరఫరా చేసిన బియ్యం నిల్వ ఉంది. దీంతో ఈమాసం లో ఏఏ షాపుల్లో ఎంత సన్న బియ్యం మిగిలాయో వివరాలు తెలుసుకుని వారి కార్డులకు అనుగుణంగా పౌర సరఫరాల అధికారులు బియ్యం పంపిస్తున్నారు. జిల్లాలో 5,28,303 రేషన్‌కార్డులు ఉండగా.. వీటికి సంబంధించి ఇప్పటి వరకు 5,550 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని రేషన్ షాపులకు తరలించారు.
నీలగిరిలో రెండు రోజులు ఆలస్యంగా..
సెప్టెంబర్ నెలకు సంబంధించి గ్రామాల్లోని రేషన్‌దుకాణాలకు ఆగస్టు చివరికే బియ్యం సరఫరా చేశారు. పట్టణ ప్రాంతంలో కొన్ని షాపుల్లో పాత నిల్వ ఉండడంతో రవాణాలో కొంత జాప్యం జరిగింది. కానీ పాత నిల్వను కూడా పంపిణీ చేసేందుకు 1వ తేదీ నుంచి దుకాణాలు తెరవాల్సి ఉన్నా.. నల్లగొండలో కొందరు డీలర్లు దుకాణాలు తెరవలేదు. కొందరు 2వ తేదీన, మరికొందరు 3వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో షాపులు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు కొంత ఇబ్బంది పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో కొత్తగా 65,749 రేషన్ కార్డులను మంజూరు చేసింది. వాటిలో జూన్‌కంటే ముందే కార్డులు పొందిన 21,649 కార్డుదారులు జూన్‌లోనే మూడు నెలల బియ్యం తీసుకున్నారు. ఈ సెప్టెంబరు నుంచి జిల్లాలో 44,099 కుటుంబాలు మొదటిసారి సన్న బియ్యం తీసుకోనున్నారు.
ఫ రేషన్ దుకాణాల్లో సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యం పంపిణీ
ఫ ఇప్పటికే షాపులకు చేరిన 75 శాతం బియ్యం