
సర్కారు స్కూళ్లలో ‘సరిగమపదనిస’
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇకనుంచి సంగీత పాఠాలు నేర్పించనున్నారు. ఇందుకు గాను పీఎంశ్రీ (ప్రైం మినీస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం కింద జిల్లాలో 42 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలోని 18 పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంగీతం నేర్పిస్తారు. ఎంపిక చేసిన పాఠశాలలకు ఇప్పటికే సంగీత వాయిద్య పరికరాలు పంపారు. అందులో డోలక్, తబల, హార్మోనియం, వయోలిన్ వంటివి ఉన్నాయి. కానీ.. సంగీత ఉపాధ్యాయుల నియామకంపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఎంపికై న పాఠశాలలు ఇవే..
సంగీత పాఠాలు నేర్పేందుకు 18 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 10 తెలంగాణ మోడల్ స్కూళ్లు (గుండ్లపల్లి, గుర్రంపోడు, నాంపల్లి, శాలిగౌరారం, మర్రిగూడ, కనగల్, నిడమనూరు, చింతపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి), 3 జెడ్పీహెచ్‌ఎస్‌లు (పెద్దవూర, హాలియా, దామరచర్ల), 3 కేజీబీవీలు (కట్టంగూర్, చందంపేట, పీఏపల్లి), 2 గిరిజన బాలికల గురుకుల పాఠశాలలు (దేవరకొండ, కొండమల్లేపల్లి) ఉన్నాయి.
సంగీతంతో ఏకాగ్రత
అయితే మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఇంటర్ వరకు విద్యనందిస్తున్నారు. దీంతో ఎక్కువగా ఆయా పాఠశాలలనే సంగీతం నేర్పించేందుకు ఎంపిక చేశారు. సంగీత సాధనతో విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. సంగీతం శ్రవణానందంగా ఉంటుంది కాబట్టి పిల్లలు వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపనున్నారని విద్యా శాఖ భావిస్తోంది.
సంగీత ఉపాధ్యాయులు దొరికేనా..
ప్రభుత్వం విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పించాలని భావించడం శుభ పరిణామం. అందుకు సంబంధించి వాయిద్య పరికరాలను పాఠశాలలకు పంపించింది. ఒక టీచర్‌కు నాలుగు రకాల సంగీత పరికరాలపై ప్రావీణ్యం ఉండడం అరుదు. అలాంటి సందర్భంలో విద్యార్థులకు సంగీతం నేర్పాలంటే నాలుగు రకాల బోధకులు అవసరం. ఇలా సంగీత ఉపాధ్యాయులు దొరకడం కాస్త కష్టమే.
ఆదేశాలు రావాల్సి ఉంది
జిల్లాలో 18 పాఠశాలలకు వాయిద్య పరికరాలు వచ్చాయి. సంగీత బోధకుల నియామకం విషయంలో ఇంకా పైఅధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. వారిచ్చే ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటాం.
– భిక్షపతి, డీఈఓ
ఫ 18 పాఠశాలలను ఎంపిక చేసిన విద్యా శాఖ
ఫ ఆయా పాఠశాలలకు చేరిన వాయిద్య పరికరాలు
ఫ ఉపాధ్యాయుల నియామకంపై కొరవడిన స్పష్టత