
మూసీ రెండు గేట్ల ఎత్తివేత
● 1,300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ● పరీవాహక ప్రాంతాలు అప్రమత్తం
కేతేపల్లి : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. వారం రోజులుగా మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చి చేరుతోంది. గురువారం రాత్రి 1,423 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా శుక్రవారం ఉదయానికి 1,650 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 643.50అడుగులు (4.07టీఎంసీలు) నీరు ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. శుక్రవారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ ఉదయం 10 గంటలకు మూసీ ప్రాజెక్టు 3, 8 నంబరు క్రస్ట్‌గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి 1300 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. కుడి కాల్వకు 167 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 215 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నీటి విడుదల నేపథ్యంలో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ ఇరిగేషన్ డీఈ శ్రీనివాసరావు, మూసీ ఏఈలు ఉదయ్, కీర్తి పాల్గొన్నారు.
మొరాయించిన గేట్లు..
విద్యుత్ లోవోల్టేజీ సమస్య కారణంగా మూసీ గేట్లు మొరాయించాయి. మూసీ ప్రాజెక్టుకు సూర్యాపేట మండలం ఎర్కారం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరపరా అవుతుంది. అయితే లోవోల్టేజీ సమస్య కారణంగా అధికారులు గేట్లు ఎత్తేందుకు స్విచ్ ఆన్ చేసినప్పటికీ గేట్లు పైకి లేవలేదు. దీంతో డ్యాం వద్ద అందుబాటులో ఉన్న జనరేటర్ సహాయంతో అధికారులు గేట్లను పైకెత్తారు.