పత్తి రైతుకు చినుకు చింత! | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు చినుకు చింత!

Jul 16 2025 3:25 AM | Updated on Jul 16 2025 3:25 AM

పత్తి

పత్తి రైతుకు చినుకు చింత!

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలో వర్షం జాడ కరువైంది. జిల్లా అంతటా ఇప్పటి వరకు 141 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 88.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలోనూ ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. పది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలపైన నమోదువుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత సీజన్‌లో సాగు చేసిన పత్తిచేలు వాడుబట్టిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఎప్పుడు కురుస్తుందా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొందరు రైతులు వాడుబడుతున్న తమ పత్తిచేలకు స్ప్రింక్లర్లతో నీటి తడుతు ఇచ్చి మొక్కలను కాపాడుకుంటున్నారు.

3.84 లక్షల ఎకరాల పత్తిసాగు

మృగశిర కార్తెలో నైరుతి రుతుపవనాలు కారణంగా కురిసిన వర్షాలకే వివిధ మండలాల్లో చాలామంది రైతులు ముందస్తుగా పత్తిగింజలు నాటుకున్నారు. ఆ తరువాత ఆరుద్ర కార్తెలో వచ్చిన వర్షాలకు మిగతా రైతులు కూడా పత్తిగింజలు విత్తారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3,84,641 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేసుకున్నారు. జిల్లా అంతటా పత్తిచేలలో గుంటకలు లోలుకుని, కలుపుతీసుకుని ఎరువులను కూడా పెట్టుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో చేలు పంగ దశలో ఉండగా ఆరుద్ర కార్తెలో గింజలు పెట్టుకున్న ప్రాంతాల్లో నాలుగైఐదు ఆకుల దశలో ఉన్నాయి.

వాడుతున్న మొక్కలు

వారం పది రోజులుగా వరుణుడు మొఖం చాటేయడంతో వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో వర్షాలు కువకపోవడంతో చాలా ప్రాంతాల్లో పత్తి మొలకలు వాడుబట్టాయి. 17 మండలాల్లో లోటు వర్షపాతం, 7 మండలాల్లో అతిలోటు వర్షంపాతం నమొదు కావడంతో ఆయా మండలాల్లో పత్తిచేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో వారం రోజుల లోపల వర్షం కురవకపోతే పత్తిచేలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప పత్తిచేలు దక్కవని, తాము పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

జూలై మాసం వచ్చినప్పటికి ఎండల తీవ్రత తగ్గడం లేదు. జూన్‌ మొదటి వారంలోనే వర్షాలు పడి ఉష్ణోగ్రతలు తగ్గిపోవాలి. ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవకపోవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వరకు నమోదై ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల నుంచి గమనిస్తే ఈ నెల 9వ తేదీన గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌ నమోదుకాగా.. ఇప్పుడు 35 డిగ్రీలు దాటాయి. గాలిలో తేమ కూడా తగ్గడంతో పత్తి మొక్కలు వాడిపోతున్నాయి.

మండలాల వారీగా వర్షపాతం ఇలా..

జిల్లాలో ఒక్క మర్రిగూడ మండలంలోనే సాధారణ కంటే ఎక్కువ వర్షం కురిసింది. చిట్యాల, మునుగోడు, చింతపల్లి, నేరెడుగొమ్ము, కొండమల్లేపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నార్కట్‌పల్లి, కట్టంగూర్‌, శాలిగౌరారం, నకిరేకల్‌, కేతేపల్లి, తిప్పర్తి, నల్లగొండ, కనగల్‌, చండూరు, త్రిపురారం, మాడుగులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, పెద్దవూర, పీఏపల్లి, గట్టుప్పల్‌, గుడిపల్లి మండలాల్లో సాధారణ వర్షంపాతం కంటే లోటు వర్షం కురిసింది. నాంపల్లి, గుర్రంపోడు, అనుముల హాలియా, నిడమనూరు, వేములపల్లి, మిర్యాలగూడ, తిరుమలగిరిసాగర్‌ మండలాల్లో అతిలోటు వర్షపాతం నమోదైంది.

మఖం చాటేసిన వరుణుడు

ఫ 35 డిగ్రీల పైన నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు

ఫ వాడుతున్న పత్తి మొక్కలు

ఫ ఒక్క మర్రిగూడ మండలంలో అధిక వర్షపాతం నమోదు

ఫ ఏడు మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు

ఫ జిల్లా వ్యాప్తంగా 3,84,641 ఎకరాల్లో పత్తిసాగు

వారం రోజులుగా

నమోదైన గరిష్ట

ఉష్ణోగ్రతలు ఇలా..

తేదీ ఉష్ణోగ్రత

09 34

10 34.5

11 36.0

12 35.0

13 35.5

14 36.0

15 35.5

వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..)

ఇప్పటి వరకు కురవాల్సింది 141.9

కురిసిన వర్షం 88.9

లోటు వర్షపాతం మండలాలు 17

అతిలోటు మండలాలు 07

వర్షంలేక మొక్కలు ఎండుతున్నాయి

పత్తిచేనుకు గుంటుక తోలుకుని ఎరువులు కూడా పెట్టుకున్నాం. పది రోజులుగా వర్షం లేకపోవడంతో పత్తి మొక్కలు వాడుపడుతున్నాయి. వారంలోగా వర్షం రాకపోతే పత్తిచేలు పూర్తిగా ఎండిపోయి పెట్టుబడులు నష్టపోయేలా ఉన్నాం.

– చిమట భిక్షమయ్య,

రైతు గుండ్లపల్లి, నల్లగొండ మండలం

పత్తి రైతుకు చినుకు చింత! 1
1/2

పత్తి రైతుకు చినుకు చింత!

పత్తి రైతుకు చినుకు చింత! 2
2/2

పత్తి రైతుకు చినుకు చింత!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement