
గురుకులాల్లో ఎందుకిలా..?
రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య
ఆశ్రమ పాఠశాల
హెచ్‌ఎం సస్పెన్షన్
నల్లగొండ : దేవరకొండ మండలం కమలాపూర్ (ముదిగొండ) గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) ఎ.వేదాద్రిపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. హెచ్‌ఎం పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థులను అనారోగ్యం పాలయ్యారని తేలినందున సీసీఏ రూల్స్ ప్రకారం తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని, క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యేవరకు అమలులో ఉంటాయని తెలిపారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట వద్ద బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని సంధ్య(11) పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, అదే రోజు దేవరకొండలోని ఆశ్రమ పాఠశాలలో 40 మంది, మర్రిగూడలోని మోడల్ స్కూల్‌లోని బాలికల హాస్టల్‌లో 18 మంది విద్యార్థినులు ఫుడ్‌పాయిజన్‌తో ఆస్పత్రి పాలయ్యారు. ఇవే కాకుండా మంగళవారం తెలవారుజామున నడిగూడెంలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనూష మహాలక్ష్మి క్లాస్‌రూమ్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో గురుకులాల్లో అసలు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనలతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే తమ పిల్లల బాగోగులపై ఆందోళన చెందుతున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యం,
పర్యవేక్షణ లోపమే కారణమా?
తూప్రాన్‌పేట బీసీ గురుకుల పాఠశాలలో సంధ్య ఆత్మహత్య చేసుకోవడం వెనుక సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యంతోపాటు భద్రతపరమైన లోపాలు ఉన్నట్లు తెలిసింది. నాలుగంతస్తులు ఉన్న ఆ భవనంపైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల వద్ద కనీసం గేటు కూడా లేకపోవడంతోనే ఆ బాలిక భవనంపైకి కిందకి దూకినట్లు అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. వందల మంది విద్యార్థులు ఉండే గురుకులాల్లో, అందులోనూ బాలికల గురుకులాల్లో కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాత్రి వేళలలో పర్యవేక్షించాల్సిన సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం వల్లే ఆ సంఘటన జరిగినట్లు తెలిసింది. డ్యూటీల సమయంలో మెళకువతో ఉండాల్సి ఉన్నా వారు నిద్రపోవడం వల్లే బాలిక భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లు సమాచారం. ఇక నడిగూడెం కేజీబీవీలో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఇదే పరిస్థితి నెలకొంది. పైగా తరగతి గదికి తాళం వేయలేదని, దాంతో బాలిక తరగతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, వార్డెన్లు సరిగ్గా పట్టించుకోకపోవడం, అందుబాటులో ఉండకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాణ్యత లేని భోజనంతో ఆసుపత్రులపాలు
గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ లోపం, అందుబాటులో ఉండకపోవడం, భోజనం నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. దేవరకొండ, మర్రిగూడ పాఠశాలల్లో ఈ కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో భోజనం నాణ్యతను పట్టించుకునే వారే లేరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడు మండల కేంద్రంలో విద్యార్థులకు వండి పెడుతున్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని పలుమార్లు హాస్టల్ తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యే, జిల్లా అధికారులకు విద్యార్థులు మొర పెట్టుకున్నారు. అయినా భోజనంలో మార్పు రావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లా అంతటా ఉంది.
ఏడాది కాలంలో జరిగిన పలు ఘటనలు ఇవీ..
● డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గతేడాది జూన్ 3, 4, 5 తేదీల్లో 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికే అవే గదుల్లో విద్యార్థినులు ఉండాల్సి వస్తోంది.
● గతేడాది దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకులంలో నిద్రిస్తున్న 13 మంది విద్యార్థులను ఎలుకలు కరవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
● పీఏపల్లి మండలంలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో గతేడాది డిసెంబరులో బియ్యం సరిగాలేక, అన్నం సరిగా ఉడకకపోవడంతో విద్యార్థినులు భోజనం చేయలేదు. దీంతో నలుగురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు.
ఫ ఫుడ్ పాయిజన్‌తో పలువురు ఆస్పత్రి పాలు
ఫ పట్టింపులేని సిబ్బంది, అందుబాటులో ఉండని ప్రిన్సిపాళ్లు
ఫ కనిపించని ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఫ వరుస సంఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన

గురుకులాల్లో ఎందుకిలా..?