
బంగారం దొంగిలించిన నిందితుల రిమాండ్
పెన్‌పహాడ్: బంగారం దొంగిలించిన ఇద్దరు నిందితులను పెన్‌పహాడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఎస్‌ఐ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారును ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద 4.7తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. వారిలో ఒకరు పాత నేరస్తుడు ఖమ్మంపాటి నాగేశ్వర్‌రావు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. గత నెల 20న పెన్‌పహాడ్ గ్రామంలో గుండపనేని వెంకట్రావు ఇంట్లో 4.7 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు నిందితుడు అంగీకరించారు. అదేవిధంగా ఈ నెల 5న నాగేశ్వర్‌రావు, మరో నిందితుడు మామిడి జనార్ధన్ కలిసి దూపహాడ్ గ్రామానికి చెందిన పత్తిపాక సైదులు ఇంట్లో రూ.2వేలు నగదు దొంగిలించారని డీఎస్పీ తెలిపారు. దొంగతనం చేసిన బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా.. నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ గోపికృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.