హోటళ్ల యజమానులు నిబంధనలు పాటించాలి
నల్లగొండ: హోటల్స్, దాబాలు, రెస్టారెంట్ల యజమానులు నిబంధనలు పాటించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దాబా హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో హైవేపై ఉన్న హోటల్స్, దాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. దాబాల వద్ద వాహనదారులు ఆగే సమయంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటి నియంత్రణకు హైవేపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. హోటల్స్ వద్ద సరైన పార్కింగ్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని దాబా హోటళ్ల యజమానులను ఆదేశించారు. దాబాల వద్దకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయే వాహనదారుల వివరాలు తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించాలన్నారు. దాబాలు, రెస్టారెంట్లలో మద్యం, గంజాయి విక్రయించడం, సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సీఐ రాఘవరావు, ఎస్‌బీ సీఐ రాము, ఎస్‌ఐ సైదులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
కట్టంగూర్ : ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ప్రాంతీయ ఉద్యాన అధికారి శ్వేత అన్నారు. శనివారం కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో చెరుకు లక్ష్మి వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. ఆయిల్ పామ్ అధిక దిగుబడులు ఇస్తుందని, మార్కెట్ సంబంధం లేకుండా కంపెనీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎకరం ఆయిల్ పామ్ సాగుతో రూ.1.25 లక్షలు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పతంజలి ఫుడ్స్ నల్లగొండ జిల్లా మేనేజర్ నర్రా రవీందర్‌రెడ్డి, చిట్యాల డివిజన్ అధికారి వినయ్‌కుమార్, రామదాసు, శీను, ప్రసాద్ ఉన్నారు.
యాదగిరీశుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. ప్రభాతవేళ స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవా హన సేవ, స్వామి,అమ్మవార్ల నిత్యకల్యాణం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. ముఖ మండపంలో బ్రహ్మోత్సవం నిర్వహించారు.
హోటళ్ల యజమానులు నిబంధనలు పాటించాలి


