ఉద్రిక్తత నడుమ ఉపసర్పంచ్ ఎన్నిక
కట్టంగూర్ : కట్టంగూర్ ఉపసర్పంచ్ ఎన్నిక శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగింది. కట్టంగూర్‌లో 14 వార్డులు ఉండగా.. ఈ నెల 11న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి తరఫున బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుతో ఏడుగురు వార్డు సభ్యులు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ముక్కాముల శ్యామలాశేఖర్ సర్పంచ్‌గా గెలుపొందారు. అదే రోజు ఉపసర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉన్నా.. ఉపసర్పంచ్ పదవికి పోటీ నెలకొనటంతో వాయిదా పడింది. 12వ తేదీన ఉపసర్పంచ్ ఎన్నికకు సమావేశం ఏర్పాటు చేసినా సభ్యులు హాజరు కాకపోవడంతో ఈనెల 19కి వాయిదా పడింది. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమావేశానికి సర్పంచ్‌తో పాటు 14 మంది వార్డు సభ్యులు సకాలంలో హాజరయ్యారు. అధికారులు ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు వార్డు సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వార్డు సభ్యులకు అడ్డుగా వచ్చిన పోలీసులను, అధికారులను తోసివేసినట్లు తెలిసింది. అయితే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ఉపసర్పంచ్ అభ్యర్థిగా 8వ వార్డుకు చెందిన గుండు రాంబాబుకు చేతులెత్తి మద్దతు తెలిపారు. రాంబాబుతో కలిపి 8 మంది కావటంతో ఎన్నికల అధికారి అంబటి అంజయ్య ఉపసర్పంచ్‌గా గుండు రాంబాబు ఎన్నికై నట్లు ప్రకటించారు. ఎన్నిక సమయంలో జరిగిన తోపులాటలో 4వ వార్డు సభ్యురాలు ఏకుల సుజాత, 5వ వార్డు సభ్యురాలు శ్రీరామ సంధ్యకు స్వల్పగాయాలయ్యాయి. ఏకుల సుజాతను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్‌రావు, శాలిగౌరారం రూరల్ సీఐ కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ మునుగోటి రవీందర్ ఉన్నారు.


