లెక్క చెప్పాలి!
పంచాయతీ పోటీదారులు ఎన్నికల ఖర్చు సమర్పించాలి
ఫ 45 రోజుల్లోగా ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
ఫ ఈ సారి ‘టీఈ–పోల్’ పోర్టల్‌లో లెక్కలు అప్‌లోడ్ చేయనున్న అధికారులు
ఫ పారదర్శకంగా ఉండేలానూతన విధానం
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు ఖర్చు చేయవచ్చు. అదే వార్డు మెంబర్‌గా పోటీ చేసే అభ్యర్థి అయితే రూ.30,000 వరకు ఖర్చు చేయవచ్చు. 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్ఠంగా రూ.2,50,000 వరకు.. వార్డు అభ్యర్థి రూ.50,000 వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇదిలా ఉంటే జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలివిడత ఎన్నికల్లో పాల్గొన్నవారు 2026, జనవరి 24 లోపు, రెండో విడత జనవరి 27న, మూడో విడతలో పోటీ చేసిన అభ్యర్థులు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు సమర్పించాలి.
నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల లెక్కలను అధికారులకు సమర్పించాల్సి ఉంది. 45 రోజుల్లోగా ఎంపీడీఓలకు లెక్కలు సమర్పించి రశీదు తీసుకోవాలి. ఈ సారి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు కాగితం రూపంలో ఎంపీడీఓలకు సమర్పించిన వివరాలను, అధికారులు టీఈ–పోల్ వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15లోగా పంపాలని స్టేట్ ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది.
గడువులోపు సమర్పించకపోతే వేటే..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలను అప్పచెప్పకుంటే వారిపై అనర్హత వేటు తప్పదంటున్నారు అధికారులు. ఎన్నికల నిబంధన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు.. వారికి గుర్తులు కేటాయించిన రోజునుంచి ఫలితాలు వెలువడే వరకు ఖర్చు చేసిన లెక్కలు ఎంపీడీఓలకు అప్పగించి రశీదు తీసుకోవాలి. 45 రోజుల్లోగా లెక్కల వివరాలు సమర్పించకపోతే పంచాయతీరాజ్ చట్టం –2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోవడంతో పాటు మరో మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన అభ్యర్థులు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు.
666 పంచాయతీల్లో ఎన్నికలు
జిల్లాలో మొత్తం 869 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 666 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అదే విధంగా 6,120 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మూడు పంచాయతీల్లో వివిధ కారణాలతో ఎన్నికలు ఆగాయి. గెలిచిన వారితోపాటు.. ఓడిన వారు కూడా లెక్కలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
సర్పంచ్‌లు తమ బాధ్యతలను గుర్తెరిగి ఆ ప్రకారం పని చేయాల్సి ఉంటుంది. నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం, రెండు నెలల కోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. మొదట వారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అవగాహన కల్పించనున్నారు.


