జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీలో గల టీజీఎంఆర్ బాలుర పాఠశాలలో శుక్రవారం క్రీడా పోటీలను టీజీఎంఆర్ అసిస్టెంట్ సెక్రటరీ ఎంఏ.ఖమ్యూం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు క్రీడా పోటీలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. క్రీడా పోటీలు విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో డీఏసీ సురేష్, విజిలెన్స్ అధికారులు ప్రభు, అబ్దుల్ హమీద్, ఏఏ.ఖాన్, హాశం, వేణుగోపాల్, ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, మునీర్, వెంకట్‌రెడ్డి, ఫారూక్ పాల్గొన్నారు.
రేషన్ డీలర్లు ఇ–కేవైసీ పూర్తి చేయాలి
నల్లగొండ : రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇ–కేవైసీని 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహసీల్దార్లను శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ 74.10 శాతం పూర్తయిందని మిగిలిన ఇ–కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. ఇ–కేవైసీ పూర్తికి అధికారులు క్షేత్రస్థాయిలో రేషన్‌షాపులకు వెళ్లి డీలర్లకు తగిన సూచనలు చేసేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
సమావేశాలను విజయవంతం చేయాలి
నల్లగొండ టూటౌన్ : జనగామ జిల్లా కేంద్రంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి కోరారు. శుక్రవారం నల్లగొండలోని యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశాల పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సమావేశాలకు ఉపాధ్యాయులు, సంఘం నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎడ్ల సైదులు, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, సైదులు, కొమర్రాజు సైదులు, మిట్టపల్లి మురళయ్య, మధుసూదన్ పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యామూర్తి బదిలీ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎం.రాధాకృష్ణ చౌహన్ సికింద్రాబాద్ జ్యూడీషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల క్రితం ఆయన పదోన్నతిపై హుజూర్‌నగర్ కోర్టు నుంచి సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చారు. సాధారణ బదిలీల్లో భాగంగా అకాడమీకి వెళ్లారు. అక్కడ సీనియర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహించనున్నారు.
వైభవంగా గోదాదేవికి పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం అమ్మవారిని పట్టువస్త్రాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఆగమ శాస్త్రానుసారంగా పూజలు నిర్వహించారు. గోదాదేవికి ఇష్టమైన నాల్గొ పాశురాన్ని అర్చకులు, పారాయణికులు పఠించారు. ప్రత్యేకంగా తయారు చేసిన కట్టెపొంగళిని అమ్మవారికి ఆరగింపుగా సమర్పించారు. మహిళలు మంగళహారతులతో నీరాజనం పట్టారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం


