22న మాక్ డ్రిల్ నిర్వహించాలి
నల్లగొండ: విపత్తుల నిర్వహణకు ఈ నెల 22న మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం.. ఇక్కడ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. పరిస్థితులను అంచనా వేయగలిగితే నష్టాలను తగ్గించగలుగుతామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచార మార్పిడి కీలకమని, అందుకు అవసరమైన అన్ని సాధనాలు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వర్షపాతం, ప్రాజెక్టుల నీటిమట్టం, నీటి విడుదల, వంతెనలు, రోడ్ల స్థితి వంటి అంశాల రియల్ టైమ్ సమాచారం ప్రజలకు చేరవేయాలన్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవల టోల్ ఫ్రీ నంబర్ల సమాచారం ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ . శ్రీనివాస్, ఏఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఫైర్ అధికారి సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి
ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తిస్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లపై విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అర్హత, నిర్ధారణ, బ్యాంకు ఖాతాల ధ్రువీకరణ వంటి అన్ని దశలను సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాల అనుసంధానంలో లోపాలు, ఆధార్ సీడింగ్ సమస్యల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా లీడ్ బ్యాంక్ అధికారులు చూడాలన్నారు. 100 శాతం దరఖాస్తులు పూర్తిచేసిన తిరుమలగిరి సాగర్ ఎంఈవోను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


