ఇక్కడే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
అనుముల మండలం యాచారంలో 30 ఎకరాల్లో నిరాణానికి అడుగులు
ఫ ఇన్నాళ్లూ విజయవాడ అంభాపురం ఫ్యాక్టరీనే దిక్కు
ఫ మంత్రి తుమ్మల చర్యలతో దిగొచ్చిన పతంజలి సంస్థ
ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 15 వేల ఎకరాల్లో పంటసాగు
ఫ తీరనున్న ఆయిల్‌పామ్ రైతుల కష్టాలు
యాచారం గ్రామంలో ఫ్యాక్టరీ..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కలిపి 15,800 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగువుతోంది. నల్లగొండలోనే 70 శాతం పంట సాగవుతున్న నేపథ్యంలో ఫ్యాక్టరీ ఇక్కడే ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. అనుముల మండలంలోని యాచారం గ్రామంలో అనువైన రేట్లకు భూమి లభించడంతో పంతంజలి సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది. 30 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి 20 ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తంలోనే భూముల సేకరించారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భూమి పూజ చేసేందుకు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుచేస్తున్న రైతుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. అనుముల మండలంలోని యాచారం గ్రామంలో పంతంజలి సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంది. ఇన్నాళ్లూ స్థానికంగా ఫ్యాక్టరీ లేక రెండు జిల్లాల్లో పంట సాగుచేస్తున్న రైతులు విజయవాడలోని అంభాపురం ఫ్యాకర్టీ పైనే ఆధారపడ్డారు. ఇక్కడ సాగుచేస్తున్న పంటను రైతులు ఏపీకి రవాణా చేసి అమ్ముకోవడం కష్టమైంది. అప్పటి ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం మూడేళ్ల క్రితమే నల్లగొండ జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మించాల్సి ఉంది. కానీ భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని పతంజలి సంస్థకు చెందిన జిల్లా ప్రతినిధులు జాప్యం చేశారు. గతేడాది నల్లగొండలో జరిగిన సమావేశంలో అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫ్యాక్టరీ నిర్మించకపోవడంపై పతంజలి అధికారులపై మండిపడ్డారు. రెండు నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ రద్దు చేస్తామని, యాదాద్రి జిల్లా తరహాలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో దిగొచ్చిన పతంజలి సంస్థ నాలుగైదు నెలల నుంచి స్థల సేకరణ కోసం అన్ని చోట్ల విచారణ చేపట్టింది. ఎట్టకేలకు స్థలాన్ని ఫైనల్ చేశారు.
పంట దిగుబడి ఐదు వేల టన్నులు..
టార్గెట్ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పది నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల్లో పంట సాగు చేయాల్సి ఉంది. కానీ ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు ఆసక్తి చూపలేదు. పైగా ఇక్కడ పండిన పంటను రైతులు సొంత ఖర్చులతో విజయవాడలోని అంభాపురం ఫ్యా క్టరీకి తీసుకెళ్లడం భారంగా మారింది. మొక్కలను మట్టితో నింపేందుకు అయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వచ్చేది. పంటల సాగును ప్రోత్సహించాల్సిన పతంజలి సంస్థ వివిధ రకాల ఖర్చులన్నీ రైతుల పైన మోపడంతో రైతులు ఆసక్తి చూపలేకపోయారు.
రైతులకు ప్రయోజనం
జిల్లాలో పతాంజలి సంస్థ అయిల్‌పాం ఫ్యాక్టరి నిర్మాణం పూర్తి చేస్తే.. రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రవాణా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకురావాలి. రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
– పి.అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి
ధర తగ్గినా రైతులకు లాభమే..
దేశ, విదేశాల్లో ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్ ఉంది. ఎకరా వరిసాగుకు ఉపయోగించే నీళ్లతో నాలుగు ఎకరాలు ఆయిల్‌పాం సాగు చేయవచ్చు. పైగా డ్రిప్, మొక్కలకు రాయితీ లభిస్తుంది. పామాయిల్ ఎగుమతి, దిగుమతులను కేంద్ర ప్రభుత్వం బేరీజు వేస్తుంది. డిమాండ్‌ను బట్టి ప్రతి నెల రేట్లను నిర్ణయిస్తుంది. ఇటీవల ఆయిల్‌పాం ఎగుమతి, దిగుమతుల పైన సుంకాలను కేంద్రం తగ్గించింది. దీంతో టన్ను ధర రూ.13000 పడిపోయింది. ప్రస్తుతం టన్ను ధర రూ.18,778 కాగా గత నెలలో రూ.20 వేలు పలికింది. అయితే రూ.15 వేల వరకు అయిన రైతులకు నష్టం ఉండదని, ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పతంజలి సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ ఏడాది నల్లగొండ జిల్లాలో 6,500 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 3 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక్కడే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ


