
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
నల్లగొండ: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా భూ సేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే, ఎఫ్ లైన్ సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అన్నారు. అనంతరం 150 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు కలెక్టర్ సర్వే సామగ్రి అందజేశారు. సర్వేయర్లకు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌చార్జ్ ఏడీ సుజాత, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ రమణయ్య, సూపరింటెండెంట్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి