
రోడ్డు దాటాలంటే భయం.. భయం
నకిరేకల్ : నిత్యం వాహనాల రద్దీ ఉండే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నకిరేకల్ పట్టణం శివారులోని పద్మానగర్ జంక్షన్ ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఈ జంక్షన్ వద్ద గత ఆరు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 10 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రాంతాన్ని గతంలోనే బా్‌ల్‌క్ స్పాట్‌గా గుర్తించిన అధికారులు.. నామమాత్రపు భద్రతా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు పట్టణ సమీపంలో సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తికాలేదు. దీంతో ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
కొన్నాళ్లకే స్టాపర్ల తొలగింపు
పద్మానగర్ జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు ఏప్రిల్ నెలలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. సగం ఇసుక, సగం నీరు నింపి రోడ్డుకు అడ్డంగా రంబూల్స్ పెట్టారు. అవి కేవలం ఇక వారం రోజుల పాటు ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి తీసేవేశారు. దీంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ఈ జంక్షన్ పక్కనే పద్మానగర్ కాలనీ ఉంది. ఈ కాలనీవాసులు రాత్రి వేళలో జాతీయ రహదారి కూడలి దాటి నకిరేకల్ పట్టణానికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు.
అండర్‌పాస్ నిర్మాణమే పరిష్కారం
హైదారబాద్–విజయవాడ రహదారి విస్తరణ సమయంలో నకిరేకల్ ప్రధాన జంక్షన్ వద్ద అండర్‌పాస్ వంతెనలు నిర్మించలేదు. ఈ రోడ్డు గుండా రోజూ 50 వేలకుపైనే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ప్రమాదాల నివారణ చర్యలు మాత్రం చేపట్టలేదు. ప్రధానంగా నకిరేకల్‌లోని పద్మానగర్ వద్ద అండర్‌పాస్ నిర్మించలేదు. చీమలగడ్డ ఫ్లై ఓవర్ అండర్ పాసింగ్ నుంచి ఇనుపామలు జంక్షన్ వరకు సర్వీస్ రోడ్లు పూర్తి కాలేవు. నకిరేకల్ పట్టణం నుంచి హైదరాబాద్, నల్లగొండ వైపునకు వెళ్లాలంటే పద్మానగర్ జంక్షన్ దాటి వెళ్లాలి. జంక్షన్ దాటే క్రమంలో హైవేపై వాహనాలు అతి వేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అండర్ పాసింగ్ వంతెన నిర్మాణంతో సమస్యకు చెక్ పడనుంది.
ప్రమాదాలకు నిలయంగా నకిరేకల్ పద్మానగర్ జంక్షన్
ఫ బ్లాక్ స్పాట్‌గా గుర్తించినా.. నామమాత్రంగా భద్రతా చర్యలు
ఫ అండర్ పాస్ నిర్మించాలని కోరుతున్న ప్రజలు
ఫ ఇనుపాముల వద్ద పూర్తి కాని సర్వీస్ రోడ్లు
అండర్‌పాస్ నిర్మాణానికి కృషి చేస్తా
నకిరేకల్‌లోని పద్మానగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్‌పాస్ నిర్మించాలని ప్రభుత్వం దృషికి తీసుకెళ్లా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారంతో నేషనల్ హైవే అధికారులకు ఈ విషయాన్ని నివేదించాం. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే అండర్‌పాస్ నిర్మాణం చేపడతాం.
– వేముల వీరేశం, ఎమ్మెల్యే, నకిరేకల్
ప్రమాదాలు జరగకుండా చూస్తాం
నకిరేకల్‌లోని పద్మానగర్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతాం. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేలా చూస్తాం. ఇక్కడ అండర్‌పాస్ నిర్మించాల్సిన అవసరం ఉందని హైవే అదికారులకు ప్రతిపాదనలు పంపాం. ప్రజలకు కూడా ఈ జంక్షన్ వద్ద జాగ్రత్తలు పాటించాలి.
– రాజశేఖర్, సీఐ, నకిరేకల్

రోడ్డు దాటాలంటే భయం.. భయం

రోడ్డు దాటాలంటే భయం.. భయం

రోడ్డు దాటాలంటే భయం.. భయం