
బహుళ అంతస్తులు భద్రమేనా!
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం
పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలను తనిఖీ చేసి నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. నేను ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్నా.. ఎల్‌ఆర్‌ఎస్ పనితో పట్టణంలో తనిఖీలు చేయలేదు. సిబ్బంది కూడా కొత్తగా వచ్చిన వారే ఉన్నారు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవు.
– కృష్ణవేణి, మున్సిపల్ ఏసీపీ
● చుట్టూ ఖాళీ స్థలం లేకుండా
అంతస్తు మీద అంతస్తు
● భద్రతా ప్రమాణాలు పాటించని
భవన యజమానులు
● ప్రమాదం జరిగితే ఇక పరిస్థితి
ఏంటని పలువురి ప్రశ్న
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో కార్పొరేట్ షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆసుపత్రులు, పైవ్రేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఈ భారీ బహుళ అంతస్తుల భవనాల చుట్టూ కనీసం గజం కూడా ఖాళీ స్థలం వదిలేయకుండా నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాల్లో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు, మరణాలతో మన నల్లగొండ పట్టణంలోని బహుళ అంతస్తుల భవనాలు అన్ని భద్రమేనా అనే చర్చ వస్తోంది. కొందరు ఒకసారి రెండంతస్తులు నిర్మించి కాలక్రమేనా దానిపైనే మరో మూడు, నాలుగు అంతస్తుల స్లాబ్ వేశారు. సెల్లార్‌తో కలిపి ఆరేడు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న భవన యాజమానులు ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే ఐదారు అంతస్తుల భవనాలు నిర్మించడం వల్ల అనుకోకుండా షార్ట్ సర్కూట్ ప్రమాదాలు, సిలిండర్ల ద్వారా జరిగే ప్రమాదాలు, పరుపుల ద్వారా అంటుకునే మంటలు తదితర ఉపద్రవాలను నివారించాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ.. ఇక్కడ కనీసం 50 శాతం కూడా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనేది బహిరంగ రహస్యమే.
ఖాళీ స్థలం లేకుండా నిర్మాణాలు..
భవనాల నిర్మాణానికి సంబంధించి.. 30 ఫీట్ల రోడ్డులో 500 గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవన నిర్మాణం చేపడితే ముందు భాగంలో మూడు మీటర్లు, చుట్టూ రెండు మీటర్లు ఖాళీ స్థలం తప్పకుండా వదలాలి. అదే విధంగా వంద ఫీట్ల రోడ్ అయితే ముందు భాగంలో నాలుగున్నార ఫీట్లు, చుట్టూ మూడు ఫీట్లు ఖాళీ స్థలం వదలాల్సి ఉంటుంది. కానీ.. ఈ నిబంధన నీలగిరి పట్టణంలో ఎక్కడా పాటించినట్లు కనిపిండం లేదు. పట్టణంలో డాక్టర్స్ కాలనీ, బొట్టుగూడ, ప్రకాశం బజార్, డీవీకే రోడ్, హైదరాబాద్ రోడ్ లాంటి ప్రాంతాల్లో భారీ భవనాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల భవనాలు 70కి పైగా, షాపింగ్ మాల్స్ మరో 100కు పైగా, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో అయితే రోగులు, వారి సహాయకులు, షాపింగ్ మాల్స్ అయితే వినియోగదారులు, విద్యా సంస్థల్లో అయితే విద్యార్థులు వందల సంఖ్యల్లోనే ఉంటారు. ఇలాంటి అత్యంత కీలకమైన భవనాల్లో కనీస నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేయడం ద్వారా రాబోవు కాలంలో ఎలాంటి ఘటన జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
సెట్ బ్యాక్ ఉండదు.. ఫైర్‌ఇంజన్ తిరగదు
నీలగిరిలో ఇటీవల కాలంలో వ్యాపార, వాణిజ్య భవనాలు భారీగా నిర్మాణం అవుతున్నాయి. ఏ ఒక్క భవన నిర్మాణదారుడు కూడా సెట్ బ్యాక్ తీసి నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ వచ్చి ఆయా భవనాల చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉండడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు భవనాలను నిర్మాణం చేసుకుంటున్నా సంబంధిత అధికారులు కిమ్మనడం లేదనే విమర్శలు ఉన్నాయి. నేతల ఒత్తిళ్లా.. లేక మరే ఇతర కారణమో కానీ నిబంధనలు పాటించని భవనాలను అధికారులు కనీసం తనిఖీలు కూడా చేయడంలేదనే అపవాదును మూటగట్టుకుంటున్నారు.