
నీరు వృథా.. రైతు వ్యథ
నల్లగొండ : వర్షాలు సరిగ్గా కురవక ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతుంటే.. ఉన్న నీటిని ఒడిసిపట్టడంలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ అధికారులు విఫలమవుతున్నారు. నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం నుంచి గేట్ల వద్ద వాల్వ్ సక్రమంగా లేక నీరు లీకై వృథాగా పోతోంది. దాంతో ఆ ప్రాంతంలో భారీగా జమ్ము మొలవడమే గాక ఆ నీరు రైతుల పొలాల్లో పారుతోంది. దీంతో పొలాలు జాలుపట్టి పంటలు సరిగా పండడం లేదు. ఎప్పుడూ నీరు ఉండడం వల్ల పొలాలు ఆరడం లేదు. పంట కోతకు వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాల్వ్ సక్రమంగా లేక..
వాల్వ్ సక్రమంగా లేక సంవత్సరం నుంచి నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. పంటలు కోత కొచ్చిన సమయంలో వరి కోత మిషన్ దిగబడుతుండడంతో మిషన్ యజమానులు ముందుకు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ సీజన్ సమీపిస్తోంది. పొలాలు దున్నాలన్నా.. ఆరడం లేదని రైతులు వాపోతున్నారు. వృథాగా పోతున్నా నీటిని అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి లీకేజీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
ఫ ఉదయ సముద్రం గేట్ల నుంచి లీకవుతున్న నీరు
ఫ జాలు పడుతున్న పొలాలు
ఫ పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతుల ఆవేదన
ఫ ఏడాది కాలంగా పట్టించుకోని అధికారులు
వృథా నీటితో ఇబ్బంది పడుతున్నాం
వాల్వ్ సక్రమంగా బిగించకపోవడం వల్ల ఉదయ సముద్రం నుంచి పెద్ద ఎత్తున నీరు లీకై వృథాగా పోతోంది. వరద ఎక్కువై పొలాల మీదుగా పారుతుండడంతో పంట పెద్దగా రాకపోగా పండిన కొద్ది పంటను కూడా కోసుకోలేకపోతున్నాం. మళ్లీ వ్యవసాయ సీజన్ వస్తోంది. భూమి దున్నాలన్నా నీరు పోయే పరిస్థితి లేదు. ఇరిగేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. వృథా నీటితో ఇబ్బంది పడుతున్నాం.
– సముద్రాల అంజయ్య, రైతు
సమస్యను పరిష్కరిస్తాం
ప్రస్తుతం తాగునీటి కోసం ఉదయసముద్రంలో నీటిని నింపాం. నీరు అధికంగా ఉన్నప్పుడు కట్ట నుంచి కూడా సీపేజి వాటర్ వస్తుంది. ఇక్కడ తూము ఉండడం వల్ల మరింత పెరిగింది. రోజు మార్చి రోజు మరమ్మతులు చేస్తున్నాం. కానీ తగ్గడం లేదు. ఉదయ సముద్రంలో నీరు తగ్గుతుంటే సీపేజి వాటర్ తగ్గుతుంది. అప్పుడు పూర్తిగా నీరు లీక్ కాకుండా చేస్తాం. 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం.
– శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ డీఈ

నీరు వృథా.. రైతు వ్యథ

నీరు వృథా.. రైతు వ్యథ