
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త
కల్తీలను గుర్తించండిలా..
● యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ ఎరువులుగుళికలుగా ఉంటాయి.
● ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ ఫాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి.
● 5 మి.లీ. నీటిలో చెంచా ఎరువు వేసి బాగా కలిపితే స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మి.లీ. పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి.
● ఒక చెంచా యూరియాను ఐదు మి.లీ. పరిశుభ్రమైన నీటిలో వేసి కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇలాగే పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి.
పెద్దవూర: మరో పది హేను రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. రైతులు బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలను సైతం కొనుగోలు చేశారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని పెద్దవూర మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్ సూచిస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయని, వాటిని చూసి విత్తనాలు కొనుగోలు చేయొద్దని పేర్కొన్నారు. విత్తనాలు, పురుగుల మందు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
విత్తనాల ఎంపిక..
● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి.
● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు కొనుగోలు చేయొద్దు.
● రశీదుపై విక్రయదారుడి పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబర్, విక్రయదారుడి గ్రామం పేరు, సంతకం, విత్తన రకం, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, తూకం, ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి.
● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి.
● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయశాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి.
● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి.
● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతృప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి.
పురుగు మందుల ఎంపిక..
● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి.
● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు.
● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి.
● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి.
● ఒక పంటకు వాడిన మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనలతో వాడాలి.
ఎరువుల ఎంపిక..
● లైసెన్స్ కల్గిన దుకాణాల్లోనే ఎరువులు కొనాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
● మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి.
● కొనుగోలు సమయంలో డీలర్ రికార్డులో రైతు సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి.
● చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయొద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి.
కంపెనీల ప్రకటనలు చూసి
రైతులు మోసపోవద్దు

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్త