
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల జాబితాపై విచారణ
నిడమనూరు : మండలంలోని నారమ్మగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఇటీవల స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బుధవారం ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌తో పాటు ఎంపీడీవో రమేష్, పంచాయతీ రాజ్ ఏఈ సాయిప్రసాద్ విచారించారు. నిబంధనల ప్రకారం, నాలుగు చక్రాల వాహనం, పక్కా ఇల్లు, వ్యవసాయ భూమి వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
విలేజ్ పోలీస్ వ్యవస్థతో మెరుగైన సేవలు
నల్లగొండ : విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను పైఅధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజలు, పోలీసులకు సత్సంబంధాలు ఏర్పడితే నేర నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. సైబర్ నేరాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌తో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. డ్రగ్స్‌తో వచ్చే అనర్థాలు, నేర నియంత్రణ, ఇతర అంశాలపై అవగాహన కల్పించిన ఏడుగురు గ్రామ పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.
29 నుంచి రైతులకు అవగాహన
త్రిపురారం : విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ 12వ వరకు జిల్లా వ్యాప్తంగా రైతులకు కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ఆధ్వర్యంలో పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని కేవీకే కంపాసాగర్ ప్రోగాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కేవీకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విక్షిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తన రకాలు, ఎంపిక వంటి అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.