
ఎండల్లో హాయ్.. హాయ్..
సూర్యాపేట అర్బన్, నల్లగొండ టూటౌన్: వేసవి సెలవులను వృథా చేయకుండా చిన్నారులు ఏదో ఒక సాధనలో నిమగ్నమయ్యారు. కొందరు వేసవి క్రీడా శిబిరాలకు వెళ్లి తమకు ఇష్టమైన ఆటల్లో మెలకువలు నేర్చుకుంటుంటే, కొందరు అమ్మమ్మ వాళ్ల ఊళ్లకు చెరువులు, బావుల్లో ఈత నేర్చుకుంటున్నారు. పట్టణాల్లో ఉండే చిన్నారులు స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత నేర్చుకుంటూ వేసవి సెలవులను సరదాగా గడుపుతున్నారు. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గల శివం స్విమ్మింగ్ పూల్‌లో ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. యువకులు కూడా వేసవి తాపానికి తాళలేక సాయంత్రం వేళ స్విమ్మింగ్ పూల్‌కు వచ్చి ఈత కొడుతున్నారు. ఉదయం 30 నుంచి 40 మంది, సాయంత్రం 60 నుంచి 70 మంది పిల్లలు ఈత నేర్చుకోవడానికి వస్తున్నారు. గంటకు రూ.80 నుంచి రూ.100 చెల్లిస్తున్నారు. నెల రోజులకు అయితే ఒక్కొక్కరికి రూ.2,000 వరకు స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు తీసుకుంటున్నారు. ప్రతిరోజు సాయంత్రమయ్యేసరికి ఈత కొలను చిన్నారులతో కళకళలాడుతూ కనిపిస్తోంది. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇండోర్ స్టేడియం ఆవరణలో గల స్విమ్మింగ్ పూల్‌లో సైతం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులు, చిన్నారులు వచ్చి స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు.
ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్నా
ఆత్మరక్షణ కోసం సూర్యాపేటలోని కుడకుడ రోడ్డులో గల శివం స్విమ్మింగ్ పూల్‌లో ఈత నేర్చుకుంటున్నాను. 15 రోజుల నుంచి ఇక్కడకు వస్తున్నాను. మొదట గాలి ట్యూబ్ సహాయంతో ఈత కొట్టాను. ప్రస్తుతం కొంచెం కొంచెంగా ట్యూబ్ లేకుండా ఈత కొట్టగలుగుతున్నా. – సూర్యతేజ్
ఎంతో సరదాగా ఉంది
వేసవి సెలవుల్లో ఈత నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది.. నేను 20 రోజులుగా స్విమ్మింగ్ పూల్‌కు వచ్చి మా నాన్న సహాయంతో ఈత నేర్చుకుంటున్నాను. ఈ వేసవి సెలవులు అయిపోయే లోపు ఈత నేర్చుకుంటా. ఎండ వేడికి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం భలే సరదాగా ఉంది. – వేదశ్రీ
ఈత వల్ల ఎన్నో లాభాలు
చిన్నపిల్లలకు ఈత నేర్పడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చెరువులు, బావుల దగ్గరికి వెళ్లినప్పుడు వాటిల్లో మునిగిపోకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఈతరాక అనేక మంది పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈత కొట్టే పిల్లలు శారీరకంగా కూడా ధృఢంగా ఉంటారు. పిల్లలకు ఈత నేర్పడం చాలా అవసరం.
– లక్కరాజు ప్రవీణ్, స్నేహనగర్, సూర్యాపేట
ట్యూబ్‌లతో సాధన
స్విమ్మింగ్ పూల్స్‌లో చిన్నారులు ట్యూబ్‌ల సహాయంతో ఈత సాధన చేస్తున్నారు. సూర్యాపేటలోని స్విమ్మింగ్ పూల్‌లో వీరికి శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు శిక్షకులను సైతం పూల్ నిర్వాహకులు నియమించారు. అదేవిధంగా ఇద్దరు అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. వీరు నిరంతరం పిల్లలు ఈత కొట్టే విధానాన్ని, ఎవరూ పూల్‌లో మునిగిపోకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా దుస్తులు మార్చుకోవడానికి నాలుగు గదులు కూడా ఏర్పాటు చేశారు.
స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత నేర్చుకుంటూ సరదాగా గడుపుతున్న చిన్నారులు
ఆత్మరక్షణ కోసం పిల్లలకు ఈత
నేర్పిస్తున్నామంటున్న తల్లిదండ్రులు

ఎండల్లో హాయ్.. హాయ్..

ఎండల్లో హాయ్.. హాయ్..

ఎండల్లో హాయ్.. హాయ్..

ఎండల్లో హాయ్.. హాయ్..

ఎండల్లో హాయ్.. హాయ్..

ఎండల్లో హాయ్.. హాయ్..