
అర్బన్ దరఖాస్తులు.. రూరల్ పరిధిలోకి!
నల్లగొండ టూటౌన్ : నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు నీలగిరి మున్సిపాలిటీకి చెందినవి నల్లగొండ ఎంపీడీఓ లాగిన్‌లోకి వెళ్లాయి. నీలగిరి పట్టణానికి చెందిన 1200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన దరఖాస్తులు నల్లగొండ రూరల్ పరిధిలోకి వెళ్లడంతో వారికి రుణాల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులకు చెందిన యువత రాజీవ్ యువ వికాసం పథకం కింద ఉపాధి కల్పన కోసం రుణం వస్తదనే ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. నీలగిరి మున్సిపల్ లాగిన్‌లో నమోదు చేసుకున్న వారు 5,626 మంది ఉన్నారు. ఎంపీడీఓ లాగిన్‌లో పడిన వారిని కలుపుకుంటే 6826 దరఖాస్తులు అవుతాయి.
ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు..
రాజీవ్ యువ వికాసం కింద రూ.50 వేలు అయితే బ్యాంకుతో సంబంధం లేకుండా కార్పొరేషన్ ద్వారా నేరుగా మున్సిపల్ కమిషనర్లకు పంపించి లబ్ధిదారులకు చెక్ రూపం ఇవ్వాలని నిర్ణయించారు. ఇది మంజూరైతే తిరిగి రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు. రూ.లక్ష దాటితే బ్యాంకు ద్వారా రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే రుణాల కోసం యువత మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంది. మీ సేవ కేంద్రాల్లో నమోదు చేసుకునే సమయంలో జరిగిన తప్పుల వల్ల వారి దరఖాస్తులు నల్లగొండ రూరల్ పరిధిలోకి వెళ్లిపోయారు. దీని కారణంగా 1200 మందికి రాజీవ్‌యువ వికాసం కింద రుణం మంజూరయ్యే అవకాశం లేదు. దీన్ని గుర్తించిన మున్సిపల్ సిబ్బంది వాటిని మున్సిపాలిటీకి బదిలీ చేయాలని ఎంపీడీఓ కార్యాలయ అధికారులను కోరినా వారి నుంచి స్పందన లేదు. ఇటు మున్సిపాలిటీ కానీ, అటు ఎంపీడీఓ కార్యాలయం అధికారులు గానీ దీని గురించి సీరియస్‌గా పట్టించుకోకపోవడంతో యువతకు రుణం మంజూరు కాకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయం చాలా మంది దరఖాస్తుదారులకు తెలియకపోవడంతో వారు రుణం వస్తదనే ఆశతోనే ఉన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఎంపీడీఓ లాగిన్‌లోకి వెళ్లిన దరఖాస్తులను మున్సిపాలిటీ లాగిన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
మున్సిపాలిటీ లాగిన్‌లోకి మార్పిస్తాం
నల్లగొండ పట్టణానికి చెందిన యువత దరఖాస్తులు నల్లగొండ ఎంపీడీఓ లాగిన్‌లోకి వెళ్లింది వాస్తవమే. ఎంపీడీఓతో మాట్లాడి వారి లాగిన్ నుంచి మున్సిపాలిటీ లాగిన్‌లోకి తీసుకువచ్చి అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలిస్తాం.
– శ్రీనివాస్, మెప్మా టీఎంసీ
ఫ 1200 మంది రాజీవ్ యువవికాసం దరఖాస్తుల మార్పు
ఫ ఎంపీడీఓ లాగిన్‌లోకి వెళ్లినట్లు నిర్ధారణ
ఫ వాటిని మార్చకుంటే యువతకు రుణం రానట్టే..