
శాటిలైట్ టోల్ వసూలు ఇప్పట్లో లేనట్లే..
చౌటుప్పల్ రూరల్: జాతీయ రహదారులపై టోల్ వసూలుకు శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు మే 1వ తేదీ నుంచి అమలు చేస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూలుకు కచ్చితమైన సొంత నావిగేషన్ ఉపగ్రహాలు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు. జీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)ను సొంతంగా రూపొందించింది. అయితే ఈ టెక్నాలజీని ఇస్రో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే శాటిలైట్ విధానంలో టోల్ వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది. ఈ వ్యవస్థను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ఏడాది ఆగస్టు నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. అక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు జరిగిన తర్వాత దేశంలోని జాతీయ రహదారుల అన్నింటికి అమలు చేయనున్నారు. మొదటగా భారీ వాహనాలకు శాటిలైట్ టోల్ వసూలు విధానం అమలు చేసి తర్వాత కార్లు, మిగతా వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. 2027 నుండి అన్నిరకాల వాహనాలకు శాటిలైట్ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం అమలు కోసం ఫాస్టాగ్ స్థానంలో నావిగేషన్ చిప్‌ను వాహనాలకు బిగించనున్నారు. కార్లకు ఈ చిప్ జీపీఎస్ కోసం రూ.4వేల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాస్టాగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
నావిగేషన్ ఉపగ్రహాలు అందుబాటులోకి
వచ్చే వరకు వాయిదా
పూర్తిస్థాయిలో అభివృద్ధికాని
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ టెక్నాలజీ