
రేపటి నుంచి టీచర్లకువృత్యంతర శిక్షణ
నల్లగొండ : ఉపాధ్యాయులకు రేపటి నుంచి వృత్యంతర శిక్షణ నిర్వహించనున్నారు. మొదటి విడత శిక్షణ 13 నుంచి 17వ తేదీవరకు, రెండో విడత శిక్షణ 20 నుంచి 24 వరకు, మూడో విడత ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ఇన్‌చార్జిలు, జిల్లా రీసోర్స్ పర్సన్ల సంసిద్ధత సమావేశం సోమవారం నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు రోజూ ఉదయం 9.30 గంటలకు శిక్షణ తరగతులకు హాజరు కావాలని డీఈఓ భిక్షపతి కోరారు. డిజిటల్ ఎడ్యుకేషన్, కాంటెంట్ ఎన్‌రిచ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, లైఫ్ స్కిల్లింగ్ అవుట్‌కమ్స్ తదితర విషయాలపై శిక్షణనిస్తారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్పెన్స్, డైట్ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. కార్యక్రమాలకు డీఈఓ డైరెక్టర్‌గా, కోర్సు కోఆర్డినేటర్లుగా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్, క్వాలిటీ కోఆర్డినేటర్‌గా సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ అధికారి వ్యవహరిస్తారు. బడి బాట కార్యక్రమం నిర్వహించే విధానంపై చర్చించి ఎన్‌రోల్‌మెంట్‌పై తగిన చర్యలు తీసుకునేలా శిక్షణలో తెలియజేస్తారు. ఇక.. మండలస్థాయిలో ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
కవితా సంపుటి ఆవిష్కరణ
రామగిరి (నల్లగొండ): తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలకు నల్లగొండ పుట్టినిల్లుగా నిలిచిందని సాహితీవేత్త మునాసు వెంకట్ అన్నారు. శీలం భద్రయ్య రచించిన ముస్తాదు కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నల్లగొండలోని యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భద్రయ్య చక్కని భావనా శక్తితో శిల్ప సౌందర్యం కలిగిన కవితలు రాశారని అభినందించారు. యోగా గురువు మాదగాని శంకరయ్య తొలి ప్రతి స్వీకరించారు. కార్యక్రమంలో పెరుమాళ్ల ఆనంద్, మోత్కూరు నరహరి, తండు కృష్ణ కౌండిన్య, సాగర్ల సత్తయ్య, పొడిచేటి శంకర్, చిత్రకారులు బొల్లెద్దు కిశోర్‌కుమార్, కవులు నరసింహ, అరుణ జ్యోతి, రామకృష్ణ, యాదగిరి, రమేష్, గణేశ్, దాసరి శ్రీరాములు, భీమార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
యాదవులు అన్ని రంగాల్లో రాణించాలి
నల్లగొండ టౌన్ : యాదవులు రాజకీయ, విద్య, ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని హైకోర్టు న్యాయవాది చలకాని వెంకన్నయాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక యాదవభవన్‌లో యాదవ విద్యావంతుల వేదిక ఆద్వర్యంలో యాదవులకు నిర్వహించిన రాజకీయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలు యాదవులను రాజకీయంగా అణచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పిల్లి రామరాజు, చీర పంకజ్‌యాదవ్, గోపాలకృష్ణ, శ్రీనివాస్, ఎల్వీ యాదవ్, అన్ని వేణు, దుడుకు లక్ష్మీనారాయణ, రేణుక, అల్లి సుభాష్, నాగరాజు, నడ్డి బాలరాజు, అల్లి సైదులు, బాలరాజు, బి.రమాదేవి ఉన్నారు.