
బావిలో పడి బాలుడు మృతి
వలిగొండ: సరదాగా ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం ఎం. తుర్కపల్లిలో సోమవారం జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం. తుర్కపల్లికి చెందిన బట్టు సుధాకర్ చిన్న కుమారుడు బట్టు చరణ్(12) చెవిటి, మూగవాడు. సోమవారం మధ్యాహ్నం సుధాకర్ సోదరుడి కుమారుడు బట్టు గౌతంతో కలిసి చరణ్ ఎం. తుర్కపల్లి గ్రామానికే చెందిన తుమ్మల బాల్‌రెడ్డి వ్యవసాయ బావి వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. వీరికి ఈత రాకపోవడంతో బావి ఒడ్డున స్నానం చేస్తుండగా చరణ్ కాలుజారి బావిలో పడిపోయాడు. భయంతో ఇంటికి వెళ్లిన గౌతం ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. సాయంత్రం వరకు చరణ్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చరణ్ బావిలో పడిన విషయాన్ని గౌతం కుటుంబ సభ్యులకు చెప్పడంతో బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటార్లతో నీటిని తోడుతుండగా చరణ్ మృతదేహం లభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం చరణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.
మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
హుజూర్‌నగర్: అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టకున్నారు. వివరాలు.. చిలుకూరు మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి కొందరు అక్రమార్కులు టిప్పర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాలుగు మట్టి టిప్పర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. మట్టి టిప్పర్లను పట్టకున్న విషయాన్ని మైనింగ్ అధికారులకు తెలియజేశామని, వారు జరిమాన విధిస్తారని చెప్పారు.