బియ్యం అందక పేదల పస్తులు! | - | Sakshi
Sakshi News home page

బియ్యం అందక పేదల పస్తులు!

Mar 12 2025 7:33 AM | Updated on Mar 12 2025 7:28 AM

మిర్యాలగూడ : పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీలో ఆలస్యం అవుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 12వ తేదీ వచ్చినా ఇవ్వడం లేదు. పది రోజులుగా పేదలు రేషన్‌ దుకాణాల చుట్టూ తిరుగుతున్నా బియ్యం లేవంటూ డీలర్లు సమాధానం చెబుతున్నారు. దీంతో రేషన్‌ బియ్యంతోనే కడపు నింపుకునే పేదలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు.

తెరుచుకోని రేషన్‌ దుకాణాలు

బియ్యం లేక చాలా ప్రాంతాల్లో ఇప్పటివరకు రేషన్‌ దుకాణాలు తెరుచుకోలేదు. గోదాముల నుంచి బియ్యం రేషన్‌ దుకాణాలకు సరఫరా కాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే గోదాముల్లోనే బియ్యం లేనవి.. బియ్యం కొరతకు అధికారులే కారణమని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా గోదాముల్లో ఉన్న బియ్యం ఇటీవల ఖమ్మం జిల్లాకు తరలించారని.. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంపిణీ చేసేందుకు బియ్యం లేవని పేర్కొంటున్నారు. దీంతో బియ్యం ఎప్పుడు వస్తాయో తెలియక డీలర్లు, ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 8 బియ్యం నిల్వల గోదాములు..

నల్లగొండ జిల్లాలో 997 రేషన్‌ దుకాణాలకు 8 బియ్యం గోదాముల నుంచి బియ్యం పంపిణీ జరుగుతుంది. మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దవూర, దేవరకొండ, నకిరేకల్‌, నిడమనూరు, చండూరు, నాంపల్లి మండలాల్లో మండల్‌ లెవ్‌ స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 6,750 మెట్రిక్‌ టన్నుల బియ్యం పేదలకు అందిస్తున్నారు. కానీ ఇప్పటివరకు 3వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కూడా సరఫరా కాలేదు. ఇంకా సగానికి పైగా దుకాణాలకు బియ్యం చేరలేదు. మిర్యాలగూడ గోదాం పరిధిలో మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం మండలాలు ఉన్నాయి. వీటి పరిదిలో 200 రేషన్‌ దుకాణాలు ఉండగా గతంలో కొన్ని దుకాణాలకు బియ్యం సరఫరా చేశారు. మంగళవారం మూడు లారీల్లో 1,470 క్వింటాళ్ల బియ్యం రాగా.. వాటిని మిర్యాలగూడలో 8, మాడ్గులపల్లి 2 దుకాణాలకు బియ్యం అందించారు. ఇంకా 138 దుకాణాలకు బియ్యం అందాల్సి ఉంది. గడువుకు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండడంతో బియ్యం ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఇవ్వాలో తెలియక డీలర్లు ఆందోళన చెందుతున్నారు. బియ్యం పంపిణీ గడువును పెంచితే తప్ప మరో మార్గం లేదని పేర్కొంటున్నారు.

బియ్యం కొరత ఉంది

ఈనెల రేషన్‌ షాపుల్లో బియ్యం కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆదేశానుసారం ఇతర జిల్లాల నుంచి బియ్యం తెప్పించి దుకాణాలకు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 50శాతం దుకాణాలకు బియ్యాన్ని అందించాం. మిగిలిన వాటికి కూడా త్వరలోనే అందిస్తాం. బియ్యం కొరత విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం.

– నాగేశ్వర్‌రావు, డీఎం సివిల్‌ సప్లయ్‌

ఫ 12వ తేదీ వచ్చినా గోదాముల నుంచి రేషన్‌ దుకాణాలకు చేరని బియ్యం

ఫ షాపుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement