భూ వివాదంలో ఎస్సై అత్యుత్సాహం.. బలైన నిండు ప్రాణం! | Sakshi
Sakshi News home page

భూ వివాదంలో ఎస్సై అత్యుత్సాహం.. బలైన నిండు ప్రాణం!

Published Mon, Dec 11 2023 9:40 AM

- - Sakshi

చింతపల్లి: పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కిన భూ వివాదం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చింతపల్లి మండల పరిధిలోని పాలెం తండాకు చెందిన నేనావత్‌ సూర్య (56) హైదరాబాదులోని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి తోడ మరో ముగ్గురు సోదరులు ఉన్నారు.

స్వగ్రామంలో సూర్యా తల్లి పేరిట ఉన్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సమానంగా పంచుకుని సాగు చేసుకుంటున్నారు. కాగా, సూర్యా హైదరాబాద్‌లో ఉంటుండగా అతడి తమ్ముడు భీమా కొంత అన్న భూమిని సాగు చేసుకుంటున్నాడు. ఇదే విషయంపై సూర్యా అతడి తమ్ముడు భీమా మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి.

అప్పుకు భూమికి లింక్‌ పెట్టి..
సూర్యా కుమారుడు కిరణ్‌ తరచూ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో బాబాయి బీమా వద్ద కిరణ్‌ అవసరాల నిమిత్తం రూ. 3లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తిరిగి చెల్లించాలని బీమా కోరడంతో తమ భూమిని కొంత పట్టా చేయించుకున్నావని, ఆ సమస్య పరిష్కారం అయితేనే అప్పు డబ్బులు చెల్లిస్తామని సూర్యా అతడి కుమారుడు కిరణ్‌ తేల్చిచెప్పారు. విషయం పెద్ద మనుషుల వద్దకు చేరడంతో రెండు నెలల క్రితం బీమా తన పేరిట అధికంగా ఉన్న పట్టా భూమిని సోదరుడు సూర్యాపై ఎక్కించాడు.

డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదు
బీమా తన పేరిట అధికంగా ఉన్న భూమిని సూర్యా పేరిట పట్టా చేయించిన తిరిగి అప్పు చెల్లించలేదు. దీంతో విసిగిపోయిన బీమా శుక్రవారం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

దీంతో ఎస్‌ఐ సతీష్‌రెడ్డి అప్పు తిరిగి ఇవ్వడంతో తాత్సారం చేస్తున్న సూర్య, అతడి కుమారుడిని పిలిపించాలని అదే రోజు సిబ్బందిని ఆదేశించాడు. దీంతో వారు సూర్యకు ఫోన్‌ చేసి ఠాణాకు రావాలని హుకుం జారీ చేశారు.

రెండు రోజుల తర్వాత వచ్చారని..
సూర్య, అతడి కుమారుడు కిరణ్‌ ఆదివారం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. సాయంత్రం తిరిగి విధులకు హాజరైన ఎస్‌ఐ స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేస్తే రెండు రోజుల తర్వాత వస్తారా అంటూ వారిపై కోపంతో చేయిచేసుకున్నాడు. దీంతో సూర్యా అస్వస్థతకు గురై వాంతి చేసుకున్నాడు. వెంటనే పోలీస్‌ సిబ్బంది, కుటుంబ సభ్యులు సూర్యను దేవరకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కుప్పకూలి మృతిచెందాడు.

ఎస్‌ఐ చేయి చేసుకోవడంతోనే సూర్య మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు వాగ్వాదం జరిగింది. మృతదేహాన్ని చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని దేవరకొండ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

అయితే, సూర్యకు బీపీ పెరగి గుండెపోటుతో మృతిచెందాడని దేవరకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ను నల్లగొండ ఎస్పీ అపూర్వరావు సందర్శించారు. ఘటన పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చింతపల్లి ఎస్‌ఐని వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement