
హాలియా పరిధిలోని అనుముల వద్ద నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభావేదికపై నాయకులు
బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే.. కొత్త పథకాలతో పాటు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం
హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. భగత్‌ను 70 వేల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మంగళవారం హాలియా పట్టణంలోని దేవరకొండ రోడ్డు వెంట అనుముల వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధిని సీఎం వివరించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరో వైపు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. బీజేపీ ఊసెత్తలేదు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. జానారెడ్డి హయాంలో నాలుగు రోడ్లు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని, సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన నోముల భగత్ గడిచిన రెండేళ్లలో సాగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు.
నెల్లికల్లు లిఫ్ట్‌ను ప్రారంభిస్తాం..
సాగర్ నియోజకవర్గానికి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీ8, డీ8 లిఫ్ట్ పనులు పూర్తయ్యాయని, నెల్లికల్లు లిఫ్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలిన పనులు కూడా పూర్తి చేసి నెల్లికల్లు లిఫ్ట్ ప్రారంభోత్సవానికి స్వయంగా తానే వస్తానని హామీ ఇచ్చారు. నోముల భగత్ చెప్పిన పనులన్నీ పూర్తవుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ సభలో బీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, మధుసూదనాచారి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, నాయకులు కడారి అంజయ్య యాదవ్, బాబురావు నాయక్, కర్ణ బ్రహ్మా రెడ్డి, మార్కెట్ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీలు అబ్బిడి కృష్ణారెడ్డి, సూర్యాభాష్యానాయక్, ఎంపీపీలు పేర్ల సుమతిపురుషోత్తం, బొల్లం జయమ్మ, ఆంగోతు భగవాన్‌నాయక్, నందికొండ మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో నూతనోత్సాహం
వేలాదిగా తరలివచ్చిన జనంతో సీఎం కేసీఆర్ బహిరంగ సభ గులాబీమయమైంది. ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. మధ్యాహ్నం 3గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో వచ్చేసరికి.. సభలో చాలామంది జనం రోడ్డుపై నిలవడం వల్ల సభలోని కుర్చీలు ఖాళీగా కనిపించాయి. రోడ్డుపై నిలిచి ఉన్న ప్రజలను సభలోకి రావాలని నోముల భగత్ పదేపదే పిలుపునివ్వడంతో జనం సభలోకి వచ్చారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకోగానే ప్రజలు కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో 24 గంటల విద్యుత్, ధరణి ఉండాలా..? వద్దా..? అంటూ ప్రజలను కోరగా.. ఉండాలి అని ప్రజలు నినాదాలు చేయడం కనిపించింది. రైతుబంధు వద్దా.. అన్నప్పుడు అందరూ కావాలంటూ చేతులు పైకెత్తి జై కేసీఆర్ అంటూ నినదించారు. బహిరంగసభలో సీఎం కేసీఆర్ 25 నిమిషాలు ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రజలు క్రమంగా వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. కాగా, సీఎం పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తును ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షించారు.
ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, పక్కన బీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్, 24 గంటల కరెంట్ కావాలా వద్దా అని కేసీఆర్ ప్రశ్నించగా.. కావాలంటూ చేతులు ఎత్తిన బీఆర్‌ఎస్ శ్రేణులు
ఫ నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని నేనే వచ్చి ప్రారంభిస్తా
ఫ భగత్‌కు 70 వేల మెజార్టీ ఇవ్వాలి
ఫ జానారెడ్డి హయాంలో నాలుగు రోడ్లు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు
ఫ బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
ముఖ్యమంత్రి కేసీఆర్
