నాగార్జునసాగర్‌ బరిలో జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

నాగార్జునసాగర్‌ బరిలో జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డి     

Published Tue, Aug 29 2023 2:06 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమరానికి కాంగ్రెస్‌ నాయకులు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. 12 నియోజకవర్గాల పరిధిలో 94 మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఎవరికి టికెట్‌ లభిస్తుందో.. ఎవరికి నిరాశ ఎదురవుతుందో త్వరలోనే తేలనుంది.

మూడు నియోజకవర్గాల్లో అధిక పోటీ
బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. వారిపై పోటీ చేసేందుకే ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ దరఖాస్తులకు చివరి గడువు కావడంతో ఆరోజు వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి 94 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వారిలో కొందరు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోగా, మరి కొందరు తమ తరఫున ఇతరులను పంపించి గాంధీ భవన్‌లో దరఖాస్తు చేయించారు. వారిలో నల్లగొండ జిల్లా నుంచి 40 మంది, సూర్యాపేట జిల్లా నుంచి 29 మంది, యాదాద్రి జిల్లా నుంచి 25 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మూడు నియోజకవర్గాల్లో టికెట్‌ కావాలంటూ దరఖాస్తు చేసిన వారి సంఖ్య పది దాటిపోయింది. అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 18 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆలేరు నుంచి పోటీచేసేందుకు 16 మంది ఉత్సాహం కనబరిచారు. ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అయిన తుంగతుర్తి నుంచి 15 మంది దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తుదారుల్లో ముఖ్య నేతలు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ కావాలంటూ ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కూడా దరఖాస్తు చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఇక మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఏ నియోజకవర్గం నుంచి కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఆయన తనయలు జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్‌ నుంచి, రఘువీర్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి టికెట్‌ ఆశించి దరఖాస్తు చేసుకున్నారు.

వీరేశం వస్తారా.. మరెవరికై నా ఇస్తారా?
బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్‌ ఆశించినా అధిష్టానం ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. అయితే, ఇప్పటివరకు ఆయన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్‌పార్టీ ఎవరిని పోటీలో ఉంచుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

సీనియర్లను కాదని ఇచ్చేనా?
ఉమ్మడి జిల్లాలోని సీనియర్‌ నాయకులు, గతంలో పోటీ చేసిన వారిని కాదని కొత్త వారికి టికెట్‌ కేటాయిస్తారా? లేదంటే పాత వారికే ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉండే అభ్యర్థులను దీటుగా ఎదుర్కొనే వారికే టికెట్లను కేటాయిస్తారా? అన్నది కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిటీ తేల్చాల్సి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పుడు కూడా టికెట్లను అడుతున్నారు. నల్లగొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని మరొకరికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంటుందా? అంటే కష్టమేనన్న వాదన పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

సూర్యాపేటలోనూ అదే పరిస్థితి నెలకొంది. మునుగోడులో ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన స్రవంతికి ఇస్తారా? ఆ ఎన్నికల నాటి నుంచే టికెట్‌ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తారా? ఒక వేళ కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే వారికి కేటాయిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక హుజూర్‌నగర్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్‌ ఆశించి మొదటి నుంచి పనిచేసుకుంటున్నారు.

అక్కడ కూడా ఆశావహులు దరఖాస్తు చేశారు. మరోవైపు కోదాడ నుంచి పద్మావతి రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరికి వస్తుందా? ఒక్కరికే ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేస్తుందా? వేచి చూడాలి. ఇక భువనగిరి నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన కుంభం అనిల్‌రెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరారు. అక్కడ ఎవరికి ఇస్తారనేది వేచి చూడాల్సింది.

కాంగ్రెస్‌ పార్టీలో భారీగా ఆశావహుల దరఖాస్తులు

దరఖాస్తుల వివరాలు ఇవీ..

నియోజకవర్గం దరఖాస్తుల సంఖ్య

నల్లగొండ 5

నకిరేకల్‌ 6

మునుగోడు 3

దేవరకొండ 7

మిర్యాలగూడ 18

నాగార్జునసాగర్‌ 1

సూర్యాపేట 5

తుంగతుర్తి 15

హుజూర్‌నగర్‌ 4

కోదాడ 5

ఆలేరు 16

భువనగిరి 9

మొత్తం 94

Advertisement

తప్పక చదవండి

Advertisement