ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యం నాగార్జున కొండ

సాగర్‌ జలాశయం మధ్యలో ఉన్న చాకలి గట్టు ద్వీపం - Sakshi
  • అభివృద్ధి చేస్తే ఆహ్లాదం.. ఆదాయం
  • అటవీ శాఖ రికార్డులకే పరిమితమైన ఐలాండ్‌ డీర్‌ పార్కు
  • పర్యాటక కేంద్రంగా మారిస్తే సాగర్‌కు పెరగనున్న సందర్శకులు

నాగార్జునసాగర్‌: చుట్టూ జల సవ్వడులు.. మధ్యలో పచ్చని చెట్లు.. పక్షలు కిలకిలరావాలు, చల్లటి గాలులతో ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతూ అందంగా కనిపించే ప్రకృతి వరప్రసాదమైన ద్వీపం చాకలిగట్టు. ఈ ద్వీపం సాగర్‌ జలాశయం మధ్యలో 400 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. నాగార్జునుడు నడయాడిన ఈ కృష్ణాతీరమంతా ఆనాడే బౌద్ధధామంగా విరాజిల్లింది. సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన తవ్వకాల్లో బయల్పడిన నాగార్జునుడు నడిపిన ఆనాటి విద్యాలయాల ఆనవాళ్లు, నాగార్జునకొండలో చెక్కుచెదరకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతున్న ఈ నాగార్జున కొండకు సమీపంలోనే ఈ చాకలిగట్టు ద్వీపం ఉండటం మరో విశేషం. అయిన్పటికీ ఈ గట్టు అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ఐలాండ్‌ డీర్‌ పార్కుగా మార్చాలనుకున్నా..

1976లో ఆనాటి జిల్లా అటవీశాఖ అధికారిగా ఉన్న గంగాఖేద్కర్‌ ఈ గట్టుపై సంచరించి ఇక్కడున్న సహజ వనరులను పరిశీలించారు. జనావాసాలకు దూరంగా ఉండటంతో ఇక్కడ జింకల సంతతి వృద్ధి చెందుతుందని భావించి ఆనాడే ఎనిమిది జింకలను తెచ్చి గట్టుపై వదిలారు. ఆ సమయంలోనే మొదటి సారిగా మాంగోలిస్‌ అనే చీమలను తినే జంతువు ఆయన కంటపడింది. ఈ గట్టుపైన మాంగోలిస్‌ ఉండటం గమనించిన ఆయన దీనిని ఐలాండ్‌ డీర్‌ పార్కుగా రూపొందించి భవనాలు నిర్మిస్తే బాగుంటుందని భావించి నప్పటికీ పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చలేదు. ఆనాటి టూరిజం శాఖ మంత్రి దేవానందరావు సాగర్‌ వచ్చినప్పుడు చాకలిగట్టును చూసి భారతదేశంలోనే మొట్టమొదటి ఐలాండ్‌ డీర్‌ పార్కుగా అభివర్ణించారు. ఈ పార్కు కేవలం అటవీ శాఖ రికార్డులకే పరిమితమైంది తప్ప అభివృద్ధికి నోచుకోవడం లేదు.

గట్టులో జింకల సంఖ్య 20కిపైనే..

అనంతరం 2013లో బబిత డివిజనల్‌ అటవీ శాఖ అధికారిగా వచ్చిన తర్వాత చాకలిగట్టు అభివృద్ధికి ఎంతగానో ప్రయత్నించారు. వారి హయాంలోనే తిరుపతి నుంచి కృష్ణజింకలు, గడ్డిజింకలతో పాటు మరికొన్ని జాతుల జింకలు, దుప్పులను తెప్పించి ఈ గట్టుపైన వదిలారు. వాటి రక్షణకు వాచర్స్‌ను ఏర్పాటు చేశారు. వాటికి వేసవిలో పచ్చిగడ్డి దొరికేందుకు సోలార్‌ పంపులను వినియోగించి జలాశయం నుంచి నీటిని తోడి భూమిని తడిపేవారు. ప్రస్తుతం ఈ జింకల సంఖ్య 20 దాటినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ జనసంచారం ఉన్నట్లుగా ఇటీవలే బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ఈమని శివనాగిరెడ్డిలు ఈ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో గుర్తించారు. సాగర్‌డ్యాం నిర్మాణంతో జలాశయం ఏర్పాటు కావడంతో చాలావరకు చరిత్ర కనుమరుగైనట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

భవనాలు నిర్మిస్తే ఆదాయం పెరుగుతుంది

చాకలిగట్టు ద్వీపంపై ప్రభుత్వం భావించినట్లు భవనాలు నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతోపాటు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు ఆదాయంతోపాటు స్థానికులకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయని టూరిజం శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చాకలిగట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top