రెండు నెలల్లో ముగ్గురు సస్పెన్షన్
చిట్యాల : మండలంలో ఈ మూడు నెలల కాలంలోనే చిట్యాల తహసీల్దార్, ఎంపీడీఓ, ఓ పాఠశాలకు చెందిన హెచ్‌ఎం ఇలా వరుసగా ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు వరుసగా సస్పెండ్ అవుతుండడంతో పాలనా వ్యవస్థ గాడితప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖల జిల్లా అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సస్పెన్షన్లు ఇలా..
● చిట్యాల పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన మాధవి ఈ ఏడాది సెప్టెంబర్ 2న సస్పెండ్ అయ్యారు. పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు విచారణకు వచ్చిన అధికారులతో వాగ్యాదం, ఘర్షణకు దిగడంతో ఆమెను డీఈఓ సస్పెండ్ చేశారు.
● చిట్యాల తహసీల్దార్ కృష్ణనాయక్ ఈ ఏడాది అక్టోబర్ 9న తన కార్యాలయంలో రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు.
● మండలంలోని చిన్నకాపర్తిలో ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం బ్యాలెట్ పేపర్‌లు మురికి కాల్వలో లభ్యమయ్యాయి. ఈ ఘటనకు చిట్యాల ఎంపీడీఓ జయలక్ష్మిని బాధ్యురాలుగా చేస్తూ ఆమెను ఈనెల 13న కలెక్టర్ సస్పెండ్ చేశారు. సస్పెండైనవారి స్థానంలో నేటికీ ఇతరులను నియమించకపోవడంతో ఇన్‌చార్జ్ పాలన కొనసాగుతోంది.
విచారణలతోనే సరి..
మండలంలో అధికారుల సస్పెన్షన్లు ఇలా ఉంటే మరోవైపు పలు సమస్యలు, అక్రమాలకు మండల స్థాయి అధికారులపై ప్రజలు ఫిర్యాదులు చేస్తే డివిజన్ స్థాయి అధికారులు విచారణలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
● అక్టోబర్ 5న రసాయన పరిశ్రమలు వదిలిన వ్యవర్థాలతో పిట్టంపల్లిలో అరవై గొర్రెలు, మేకలు మృతిచెందాయి. ప్రజల ఫిర్యాదుతో విచారణ జరిపిన ఆర్డీఓ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
● వట్టిమర్తి పరిధిలోని ఓ ఆగ్రో కెమికల్స్ పరిశ్రమలో నింబధనలకు విరుద్ధంగా రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు అక్టోబర్ 30న ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినా చర్యల్లేవు.
● చిట్యాల, పెద్దకాపర్తి, వెలిమినేడు, పిట్టంపల్లి, వెంబావి గ్రామాల పరిధిలో అక్రమంగా మైనింగ్, సుంకెనపల్లి, పెద్దకాపర్తి, శివనేనిగూడెంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు.
● మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమ డిప్యుటేషన్‌పై పలువురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నా..అవసరం లేకున్నా విద్యా వలంటీర్లను నియమించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి సస్పెండైన వారిస్థానంలో వెంటనే కొత్తవారిని నియమించడంతోపాటు అన్ని శాఖలపై నిరంతర పర్యవేక్షణ ఉంచి తమకు మెరుగైన సేవలు అందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
చిట్యాలలో తహసీల్దార్, ఎంపీడీఓ, హెచ్‌ఎంపై వేటు
ఫ విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు
ఫ వరుస ఘటనలు జరుగుతున్నా ఆయా శాఖలపై పర్యవేక్షణ కరువు
ఫ అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
అధికారులను నియమించాలి
చిట్యాల తహసీల్దార్, ఎంపీడీఓ పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. వీరి బాధ్యతలను కిందిస్థాయి అధికారులు నిర్వహిస్తున్నారు. సస్పెండైన వారి స్థానాల్లో వెంటనే కొత్తవారిని నియమించాలి. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
– చికిలంమెట్ల అశోక్, చిట్యాల


