ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
దేవరకొండ, కొండమల్లేపల్లి : దేవరకొండ డివిజన్‌లో బుధవారం (నేడు) జరుగనున్న పంచాయతీ ఎన్నికలు ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పోలింగ్ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆమె దేవరకొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి సందర్శించారు. అంతకు ముందు దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో 3వ విడత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే కొండమల్లేపల్లిలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను ముందే చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూసుకోవాలని, ఓటింగ్ కంపార్ట్‌మ్మెంట్ కిటికీలకు దూరంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 2.15గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఎవరైనా అభ్యర్థి రీకౌంటింగ్ కోసం ఫిర్యాదు చేయదలిస్తే 15నిమిషాలలోపే రాత పూర్వకంగా ఆర్‌ఓకు దరఖాస్తు ఇవ్వాలన్నారు. జిల్లాలోని 80శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో వీడియోగ్రఫీ చేయిస్తున్నామని తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ రమణారెడ్డి, కొండమల్లేపల్లి ప్రత్యేకాధికారి విజయేందర్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, ఆయా మండలాల తహసీల్దార్లు, సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


