‘కుష్టు’ బాధితులను గుర్తించేలా.. | - | Sakshi
Sakshi News home page

‘కుష్టు’ బాధితులను గుర్తించేలా..

Dec 17 2025 7:21 AM | Updated on Dec 17 2025 7:21 AM

‘కుష్టు’ బాధితులను గుర్తించేలా..

‘కుష్టు’ బాధితులను గుర్తించేలా..

మచ్చలుంటే చూపించాలి

నల్లగొండ టౌన్‌: కుష్టు వ్యాధి (లెప్రసీ) లక్షణాలున్న వారిని ముందుగా గుర్తించి వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం 2017 నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ (ఎల్‌సీడీసీ) సర్వేను ఏటా రెండుసార్లు నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఎల్‌సీడీసీ సర్వే నిర్వహించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఆశా వర్కర్ల ద్వారా సర్వే..

జిల్లాలో లెప్రసీ క్యాంపెయిన్‌ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ ఆశా వర్కర్లతో కలిసి 1,466 బృందాలను ఏర్పాటుచేసింది. ఒక్కో ఆశా వర్కర్‌ పట్టణంలో అయితే రోజుకు 50 నుంచి 60 ఇళ్లు సర్వే చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నుంచి 30 ఇళ్లను సర్వే చేయనున్నారు. కుటుంబంలోనే ప్రతి ఒక్కరి పూర్తి శరీరాన్ని పరిశీలించి తెల్ల, ఎర్ర మచ్చలు, స్పర్శ లేని మచ్చలు, నరాల బలహీనత ఉందా లేదా అనే దాన్ని పరిశీలిస్తారు. వారిలో లెప్రసీ లక్షణాలున్న వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాలకు పంపుతారు. అక్కడ వారికి బహుళ ఔషధ చికిత్స(మల్టీ డ్రగ్‌ థెరపీ–ఎండీటీ) అందించనున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే జిల్లా కేంద్రంలోని లెప్రసీ సెంటర్‌కు పంపించి చికిత్స అందించనున్నారు. ఈ ఎల్‌సీడీసీ సర్వేపై ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మెడికల్‌ ఆపీసర్లు, సూపర్‌వైజర్లు, ప్రోగ్రామ్‌ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గతంలో జిల్లాలో లెప్రసీ కేసులు వందల సంఖ్యలో ఉండగా 2017 నుంచి చేపట్టిన ఎల్‌సీడీసీ సర్వే కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 113 లెప్రసీ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

కుష్టు లక్షణాలు ఇవీ..

కుష్టు వ్యాధి (లెప్రసీ) అనేది మైక్రో బ్యాక్టిరియమ్‌ లెప్రో అనే బ్యాక్టిరియా వల్ల కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది ప్రధానంగా నరాలు, చర్మం, ముక్కు ద్వారం, ఎగువ శ్వాస నాళాలపై ప్రభావం చూపుతుంది. చర్మంపై ఎర్రని, గోధుమ రంగు (పాలిపోయిన) స్పర్శ లేని తిమ్మిరి మచ్చలుంటే కుష్టు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.

శరీరంపై ఎక్కడైనా స్పర్శలేని తెల్లని, గోధుమ, ఎర్రటి మచ్చలున్న రోగులు ఎల్‌సీడీసీ సర్వేకు వచ్చే ఆశా వర్కర్లకు చూపించాలి. లెప్రసీ లక్షణాలుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌,

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి

రేపటి నుంచి ఎల్‌సీడీసీ సర్వే

ఫ 1,466 బృందాల నియామకం

ఫ లక్షణాలున్న వారికి చికిత్స అందించేలా కార్యాచరణ

ఫ లెప్రసీ నిర్మూలనే లక్ష్యంగా ప్రోగ్రామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement