
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, చిత్రంలో వివిధ శాఖల అధికారులు
నల్లగొండ : నిర్దేశిత లక్ష్యం మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ త్రైమాసిక సమావేశం నిర్వహించి వార్షిక రుణ ప్రణాళికలో డిసెంబర్ నాటికి సాధించిన లక్ష్యాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి, వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక, చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలన్నారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక కేటాయింపు రూ.8091 కోట్లు కాగా రూ.8790 కోట్లు ప్రాధాన్యత, ప్రాధాన్యేతర, ఇతర రంగాలకు రుణాలు అందించినట్లు తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6479 కోట్లకు గాను రూ.4541 కోట్లు రైతులకు రుణంగా అందిచామని.. మార్చి చివరి వరకు లక్ష్యం పూర్తి చేయాలన్నారు. ఎంఎస్‌ఎం ఈ కింద రూ.1538 కోట్లకు రూ.752 కోట్ల అందించినట్లు తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని చెప్పారు. 15 రోజులకోసారి బ్యాంక్ వారీగా సమీక్ష నిర్వహించాలని ఎల్‌డీఎంను అదనపు కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయం ఉపాధి శిక్షణ సంస్థ 2021–22 కార్యక్రమాల వార్షిక నివేదికను ఆమె విడుదల చేశారు. సమావేశంలో ఎల్‌డీఎం శ్రామిక్, డీఆర్‌డీఓ కాళిందిని, నాబార్డ్ డీడీఎం వినయ్, ఎస్‌బీఐ సీఎం మురళి, బ్యాంకు మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా