
యాద్గార్‌పల్లి గ్రామంలో తమిళనాడు వలస కూలీలకు విముక్తి కల్పించిన అధికారులు
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లిలో మంగళవారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వలస కూలీలకు వెట్టిచాకిరి నుంచి అధికారులు విముక్తి కల్పించారు. మిర్యాలగూడ రూరల్ అదనపు ఎస్‌ఐ ముత్యాల రాంమ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎలక నాగరాజు తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్‌పేట జిల్లాకు చెందిన శంకరం మాణిక్యం, అతడి భార్య లక్ష్మి, కుమారులు కార్తీక్, ఆకాశ్‌ను ఐదేళ్ల క్రితం యాద్గార్‌పల్లికి రప్పించి గ్రామ శివారులో గల బాతుల ఫాం వద్ద పనికి ఉంచాడు. వారితో పనిచేయించుకుంటూ డబ్బులు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాడు. కొంతమంది ఎన్జీఓస్ ద్వారా దీనిపై సమాచారం అందుకున్న యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్(ఏహెచ్‌టీయూ), లేబర్, రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం యాద్గార్‌పల్లి గ్రామానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలక నాగరాజు తమకు పనికి తగిన వేతనం ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని తమిళనాడుకు చెందిన కూలీలు అధికారులకు వివరించారు. దీంతో వారికి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించి, మండల తహసీల్దార్ అనిల్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎలక నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో తహసీల్దార్ అనిల్‌కుమార్, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ జె. గోపాల్‌రావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మంజుల, ఏహెచ్‌టీయూ సిబ్బంది నర్సింహ్మ, మధు పాల్గొన్నారు.