చండూరు: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మత్స్యకారుడు మృతిచెందిన ఘటన మండలం పరిధిలోని ఉడతలపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్ మండలం జి. యడవెల్లి గ్రామానికి చెందిన మత్స్య కారుడు సోము శ్రీను(52) చండూరు మండలం ఉడతలపల్లి గ్రామ చెరువులో చేపలు పట్టేందుకు వచ్చాడు. చేపల కోసం చెరువులో వల వేసి తిరిగి వలను తీస్తుండగా అతడి ప్యాంట్ కంపకు తగలడంతో చెరువులోని గుంతలో పడిపోయాడు. చేపలు కొనేందుకు వచ్చిన గ్రామస్తులు గమనించి అతడి బయటకు తీసే చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్ కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అతడికి జి. యడవెల్లి గ్రామ మత్స్య సొసైటీలో సభ్యత్వం ఉంది.