
చౌటుప్పల్ : ఆందోళనకారులతో మాట్లాడుతున్న ఆర్డీఓ వెంకట ఉపేందర్‌రెడ్డి
చౌటుప్పల్ : మండల పరిధిలోని నేలపట్ల, చిన్నకొండూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో రీజినల్ రింగురోడ్డు కోసం భూమిని సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. సర్వే చేసేదేలేదంటూ వాగ్వాదానికి దిగారు. ఉన్న రోడ్లు చాలు– కొత్త రోడ్లు వద్దు, పెద్దల కోసం కాకుండా పేద రైతులను దృష్టిలో ఉంచుకొని అలైన్‌మెంట్‌ను మార్చాలి, భూమికి భూమి ఇవ్వాలి, బహిరంగ మార్కెట్ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రాణాలైనా అర్పిస్తాం, రింగురోడ్డుకు భూములు మాత్రం ఇవ్వబోమని నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించి..
భూసేకరణ కోసం వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు, రైతు సంఘం నాయకులు ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాకే ఇక్కడి నుంచి కదులుతామని భీష్మించారు. అదే క్రమంలో మందోళ్లగూడెం గ్రామ శివారులోని సూపర్‌గ్యాస్ కంపెనీ వద్ద రోడ్డుపై బైఠాయించి ఽనిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పేరిట భూములను లాక్కొని తాతలకాలం నుంచి వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమను రోడ్డున పడేయొద్దని వేడుకున్నారు.
ఆర్డీఓ నచ్చజెప్పినా..
సర్వే కోసం క్షేత్రస్థాయికి వెళ్లిన తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి, డివిజన్ సర్వేయర్ వెంకటయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌రావు, మండల సర్వేయర్ మురళీధరన్‌ను రైతులు అడ్డుకున్నారు. దీంతో విషయాన్ని వారు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో ఆర్డీఓ కంచర్ల వెంకట ఉపేందర్‌రెడ్డి రైతుల వద్దకు వెళ్లారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు ససేమిరా అనడంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తదుపరి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని తెలిపారు. కాగా తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, భూమికి భూమి ఇవ్వాలని, పరిహారంగా బహిరంగ మార్కెట్ ధర చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బూర్గు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అలా చెల్లించని పక్షంలో భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు.
ఫ సర్వే ప్రాంతంలో బైఠాయించి
రైతుల నిరసన
ఫ అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్
ఫ వెనుదిరిగిన సర్వే బృందం సభ్యులు, రెవెన్యూ అధికారులు
పురుగు మందు డబ్బాలు, పెట్రోల్ బాటిళ్లతో...
తమ భూములను సర్వే చేసేందుకు సంబంధిత సర్వే బృందం వస్తుందన్న సమాచారాన్ని రైతులు ముందుగానే తెలుసుకున్నారు. అడ్డుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. మహిళలు, పురుషులు నిరసన, ధార్నా చేయాలని వచ్చారు. బలవంతంగా భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, తమ చావులకు అధికారులే కారణమవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా మహిళా రైతులు తమ వెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బాలు, పెట్రోల్ బాటిళ్లను చూపుతూ నిరసనవ్యక్తం చేశారు. ఆత్మహత్యలకై నా సిద్ధమే కానీ పంటపొలాలను రింగ్ రోడ్డుకు ఇవ్వబోమని తేల్చిచెప్పారు.

పెట్రోల్ డబ్బాలతో వచ్చిన మహిళా రైతులు