సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని జనని డయాగ్నస్టిక్ సెంటర్‌ను సోమవారం డీఎంహెచ్‌ఓ కోటాచలం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ల్యాబ్‌లోని సామగ్రిని పరిశీలించారు. సామగ్రి డేట్ ఎక్స్‌పైరీ అయినట్లు, ల్యాబ్ అనుమతి రెన్యువల్ సంవత్సరం క్రితమే ముగిసినట్లు గుర్తించారు. కంప్యూటర్, రిజిస్టర్ తనిఖీ చేసి మాన్యువల్ రిజిస్టర్‌లో ఐడీ, కంప్యూటర్ రిజిస్టర్‌లో ఐడీ ఒకటిగా లేదని గుర్తించారు. అంతే కాకుండా రక్త పరీక్ష కోసం వచ్చిన వారి వివరాలు పొందు పర్చాలని సూచించారు. ఈ నెల 25న గాంధీనగర్‌కు చెందిన వట్టె గంగరాజు షుగర్ పరీక్ష చేయించుకోగా తప్పుడు రిపోర్టు ఇచ్చారని, అతడి ఆరోపణ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పుడు రిపోర్టు ఇవ్వడమే కాకుండా మరో గంగరాజు రిపోర్టును పొరపాటున ఇచ్చామని పేర్కొంటున్నట్లు తెలిపారు. ఆ గంగరాజు పూర్తి వివరాలు లేకపోవడంతో నిర్వాహకులు మరో గంగరాజును సృష్టించారా అనే కోణంలో విచారణ చేపడుతున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ల్యాబ్ రిజిస్ట్రేషనన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట డెమో అధికారి అంజయ్య ఉన్నారు.