పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల దీనగాధ
కాలుష్యం కుమ్మరింత..
● నిబంధనలు పట్టించుకోని
ఫార్మా పరిశ్రమలు
● చెరువులు, చేలల్లోకి నేరుగా వ్యర్థ పంపింగ్
● పంటలు పండకపోవడంతో
ఆందోళనలో రైతులు
● వాయు కాలుష్యానికి కేరాఫ్‌గా
మారిన పలు ఫ్యాక్టరీలు
● నిత్యం ఆకాశాన్ని
కమ్ముకుంటున్న దట్టమైన పొగ
● దుర్గంధం భరించలేమంటూ
స్థానికుల ఆవేదన
పట్టపగలే ఓ ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కలుషిత నీటిని ఈ చిత్రంలో చూడవచ్చు. రసాయనాలతో
రంగు మారిన నీరు నేరుగా సమీపంలోని ముదిరెడ్డిపల్లిలోని పల్లె చెరువు.. దీని గుండా పొలాల్లో చేరుతోంది.
ఓ ఫార్మా పరిశ్రమ నుంచి బాయిలర్ ద్వారా చిమ్నీ నుంచి భారీ స్థాయిలో
వెదజల్లుతున్న దట్టమైన పొగను ఈ ఫొటోలో చూడవచ్చు. నల్లటి దుమ్ము, ధూళి కణాలతో పరిసరాల్లోని పంట పొలాలు, చెట్లు మసిబారిపోతున్నాయి.
చితికిపోతున్న 5 గ్రామాలు..
పోలేపల్లి సెజ్‌లో 13 వరకు ఫార్మా కంపెనీలు, మరో ఎనిమిది వరకు ఇతర పరిశ్రమలున్నాయి. ప్రధానంగా పలు ఫార్మా కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థ జలా లు నేరుగా చెరువులు, కుంటల్లో కలుస్తున్నాయి. భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు సాగుకు అనువుగా లేక పంటలు పండకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు.
బుట్టదాఖలవుతున్న ఫిర్యాదులు..
లెక్క ప్రకారం పరిశ్రమల నిర్వాహకులు ఫార్మా ఉత్పత్తుల తయారీలో వెలువడిన వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి వదిలేయాలి. అలాంటి పరికరాలు లేకుంటే ఆ నీటిని ట్యాంకర్ల ద్వారా రీసైక్లింగ్ కేంద్రాలకు పంపించాలి. ఇవేమీ పట్టించుకోకుండా నేరుగా బయటకు వదులుతున్నారు. వర్షాకాలంలో అయితే వరద పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌తో పాటు నెలకోసారి అయినా హైదరాబాద్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో వారి రోదన అరణ్యరోదనగా మారింది.


