కందనూలు: జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి యాప్ ద్వారా జనగణన ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 20 మండలాల ప్రణాళిక గణాంక అధికారులు చార్జ్ క్లర్క్, అసిస్టెంట్ చార్జ్ క్లర్క్‌లుగా, కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక సహాయకులుగా తమకు నిర్దేశించిన విధులను సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ తరగతులు అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్డులు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి కాలనీ, అపార్టుమెంట్లు, చిన్నచిన్న వీధి ప్రాంతాల్లో నివసించే ప్రతి ఇంటిని, ఇంట్లోని ప్రతిఒక్కరి గణన విధిగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. వందశాతం కచ్చితత్వంతో పూర్తి చేయడమే తమ లక్ష్యంతో జనగణన చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు, ఆవాస ప్రాంతాలు హ్యాబిటేషన్లు, గ్రామాలు, మండలాలు, పట్టణాలు, జిల్లా స్థాయి వరకు జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేలా కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, మాస్టర్ ట్రైనర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.


