సలేశ్వరం జాతరకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సలేశ్వరం జాతరకు పటిష్ట ఏర్పాట్లు

Mar 27 2026 9:59 AM | Updated on Mar 27 2026 9:59 AM

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

అచ్చంపేట: నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి.. జాతర ఏర్పాట్లు, ట్రెక్కింగ్‌ మార్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తారని, ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అడవిలో క్లిష్టమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి సరఫరా, వైద్యశిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమర్థవంతంగా అమలుచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యంగా అటవీ మార్గాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు స్పష్టమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయాలని.. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఉండాలన్నారు. అదే విధంగా స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. జాతర సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా.. వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్లు అందుబాటులో ఉండాలన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ముఖ్య ప్రాంతాల్లో మైక్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేసి.. సమాచారం అందించేలా చూడాలన్నారు. పోలీస్‌శాఖ ద్వారా ప్రత్యేక ఔట్‌పోస్ట్‌ ఏర్పాటుచేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భంలో వెంటనే గుర్తించి.. కుటుంబ సభ్యులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సలేశ్వరం జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో స్వామి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో తాగునీటి సరఫరాను విస్తరించడంతో పాటు చల్లని నీడ కల్పించే శిబిరాలు ఏర్పాటుచేయాలన్నారు. ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నల్లమల అడవిలో కఠినమైన ట్రెక్కింగ్‌ మార్గాలు, ఎత్తైన ప్రదేశాలు, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఉన్నందున గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భక్తులు జాతరకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ వెంట జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్‌ చంద్ర, ఏఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

లేబర్‌ కోడ్‌లతో కార్మిక వ్యవస్థ విచ్ఛినం

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: కార్మిక వ్యవస్థను విచ్ఛినంచేసే నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గం సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ.. కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. కార్పొరేట్‌ శక్తుల కోసమే లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి గురిచేస్తుందన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు పర్వతాలు, రామయ్య, శంకర్‌నాయక్‌, శివవర్మ, దశరథం ఉన్నారు.

30న క్రీడా పాఠశాలలకు ఎంపిక పోటీలు

కందనూలు: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థుల వయసు 8 నుంచి 9 ఏళ్లు ఉండాలని.. అర్హులైన వారు సకాలంలో హాజరుకావాలని ఆయన సూచించారు.

కంటిచూపుపై నిర్లక్ష్యం వద్దు

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రతి ఒక్కరూ కంటిచూపుపై నిర్లక్ష్యం వహించకుండా.. ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అంధత్వ ప్రోగ్రాం అధికారి డా.ప్రదీప్‌ సూచించారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత కలెక్టరేట్‌లో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించి.. క్యాటరాక్ట్‌ పొర ఉన్న 41 మందిని శస్త్రచికిత్స నిమిత్తం ప్రత్యేక అంబులెన్స్‌లో లయన్‌ రాంరెడ్డి కంటి ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఆప్తాలమిక్‌ అధికారి బాలాజీ, వైద్యసిబ్బంది వై. శ్రీనివాసులు, సుకుమార్‌రెడ్డి, నర్సింహ, చెన్నకేశవులు పాల్గొన్నారు.

ఆర్టిజన్లకు సర్వీస్‌ రూల్స్‌ వర్తింపచేయాలి

కందనూలు: విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వర్తింపచేయాలని హెచ్‌–82 యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ డివిజనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్‌శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులను విద్యార్హతల ఆధారంగా రెగ్యులర్‌ పోస్టుల్లో కన్వర్షన్‌ చేయాలన్నారు. పీస్‌ రేట్‌ కార్మికులకు జీఓ నంబర్‌ 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జేఏసీ డివిజన్‌ చైర్మన్‌ మిద్దె శ్రీనివాసులు, 327 యూనియన్‌ జిల్లా కార్యదర్శి లాలయ్య, 1104 యూనియన్‌ జిల్లా కార్యదర్శి నిరంజన్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement