● తెలంగాణ ఉన్నత విద్యామండలి
చైర్మన్ బాలకిష్టారెడ్డి
బిజినేపల్లి: ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులు కలిగిన దేశంగా భారత్ ఎదుగుతుందని.. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్యనభ్యసించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘బయో రిమిడియేషన్’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. మానవ కార్యకలాపాలతో భూ మండలంలో కాలుష్యం పెరిగి.. జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రస్తుత తరం బాధ్యత అని గుర్తుచేశారు. బయో రిమిడియేషన్ వంటి సాంకేతిక పద్ధతులు భవిష్యత్‌లో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ తరహా సెమినార్లు విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందిస్తాయన్నారు. కళాశాల ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ డీఎస్‌ఆర్ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా శాసీ్త్రయ చైతన్యం పెరగడం శుభసూచికమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి.రాములు, గీతాంజలి, సుష్మ, శ్రీనివాసులు, మనోజ్‌కుమార్, రాధాకుమారి, స్వప్న, నాగలింగం, వెంకటేశ్, రమేశ్, ప్రవళిత, యాదగిరి, ప్రకాశ్, రాములు, నర్సింహ పాల్గొన్నారు.


