నిర్వాసితుల గోడు పట్టదా?
చారకొండ: గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి.. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంపు నుంచి మినహాయించాలని మూడు నెలలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం బాధాకరమని నిర్వాసితులు సూగూరి ప్రకాశ్, శ్రీరాములు, పెద్దయ్య, పర్వతాలు, నాగయ్య నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 80వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిర్వాసితుల గోడును ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించడం సరైంది కాదన్నారు. వెంటనే పాలకులు, అధికారులు స్పందించి తమ గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని కోరారు.
నేడు డయల్
యువర్ డీఎం
కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఉమాశంకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 94937 33602 నంబర్‌కు సంప్రదించి రవాణాపరంగా సమస్యలను తెలియజేయడంతో పాటు ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ సెమిస్టర్–1కి సంబంధించి రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీయూలోని పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తదితరులు తనిఖీ చేశారు. పరీక్షలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పీయూ పరిధిలో మొ త్తం 1,851 మంది విద్యార్థులకు గాను 11 కేంద్రా లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొదటిరోజు పరీక్షకు 1,506 మంది హాజరవగా.. 346 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడుతుండగా అధికారులు డిబార్ చేశారు.
నిర్వాసితుల గోడు పట్టదా?


