గర్భిణులకు హెచ్‌ఐవీ పరీక్షలు తప్పనిసరి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో గర్భిణులకు తప్పనిసరిగా హెచ్‌ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఐసీటీసీ కౌన్సెలర్లు, ఎన్జీఓ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారితో సమావేశమై జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో హెచ్‌ఐవీ నివారణకు వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ అయిన గర్భిణులు ఏఆర్‌టీ మందులు వాడటం ద్వారా జన్మించే శిశువులకు హెచ్‌ఐవీ వ్యాపించకుండా అరికట్టగలమని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న జాతర్లు, గ్రామాల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై అవగాహన శిబిరాలను ఏర్పాటుచేసి.. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో దిశ సీపీఎం జ్యోతి, సీఎస్‌ఓ రవీందర్‌రెడ్డి, డీఎండీఓ సాయికుమార్ తదితరులు ఉన్నారు.


