ఏం చేద్దాం..ఎలా గెలుద్దాం! | - | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం..ఎలా గెలుద్దాం!

Feb 9 2026 8:07 AM | Updated on Feb 9 2026 8:45 AM

ఏం చేద్దాం..ఎలా గెలుద్దాం!

ఏం చేద్దాం..ఎలా గెలుద్దాం!

ఆఫర్స్‌..ఆకర్ష్‌

నగర డివిజన్లలో అభ్యర్థుల గెలుపు వ్యూహాలు

పాలమూరు: మరికొన్ని గంటల్లో కార్పొరేషన్‌/మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడును పెంచుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు కార్నర్‌ మీటింగ్‌లు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. చాలావార్డుల్లో త్రిముఖ, కొన్నింటిలో చతుర్ముక పోరు ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీతో పాటు, కొన్నివార్డుల్లో ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, రెబల్స్‌ బరిలో ఉన్నారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, దేవరకద్ర, భూత్పూర్‌లలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఇటీవల జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ సిన్హా నిర్వహించిన సభ ద్వారా కమలంలో ఒక జోష్‌ వచ్చింది. దీనికితోడు స్థానిక ఎంపీ డీకే అరుణ అభ్యర్థుల గెలుపు బాధ్యత తన భుజాలపై వేసుకొని మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌తో పాటు భూత్పూర్‌, దేవరకద్ర, కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు, కోస్గి, నారాయణపేట, మద్దూరులో ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నగరంలో రోజుకు మూడు నాలుగు డివిజన్‌లలో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రచారం సాగిస్తున్నాడు. మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి భూత్పూర్‌, దేవరకద్ర, కొత్తకోట పురపాలికల్లో ప్రతి రోజూ ప్రచారంలో పాల్గొంటున్నారు. నగరంలో ఎంఐఎం కూడా ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 9న షాషాబ్‌గుట్ట చౌరస్తాలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. శనివారం రాత్రి మదీనా మజీద్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ సభ జరిగింది.

నాగర్‌కర్నూల్‌లో మున్సిపల్‌ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి ధీటుగానే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సైతం వ్యూహాలు పన్నుతున్నారు. బీజేపీ కూడా పోటీలో ఉండడంతో దాదాపు అన్ని వార్డుల్లో త్రిముఖ పోరు కొనసాగుతోంది.

వనపర్తి జిల్లాలో ఐదు పురపాలికలున్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, శాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి తమ అనుచరులను గెలిపించుకునేందుకు వనపర్తి, పెబ్బేరులో ప్రతిరోజూ ఓటర్లను కలుస్తున్నారు.

50 మంది ఓటర్లకో ఇన్‌చార్జిగా నియమించి

బాధ్యతల అప్పగింత

ప్రత్యేక సమావేశాలు.. రహస్య మంతనాలు

ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు

నేటితో ముగియనున్న ప్రచారం

బరిలో ఉన్న అభ్యర్థులు కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, మైనార్టీలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి నేను కౌన్సిలర్‌గా గెలవగానే ఎమ్మెల్యేతో మాట్లాడి మీ పనులన్నీ చేసి పెడుతానంటూ హామీలు గుప్పిస్తున్నారు. రేషన్‌కార్డులిప్పిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం..గుడి కట్టిస్తాం.. రోడ్లు వేయిస్తాం.. కమ్యూనిటీ భనాలు నిర్మిస్తాం.. అంటూ అభ్యర్థులు ఓటర్లకు హామీలిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం తామేమి తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బుల పంపిణీ కోసం కొంతమంది ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడనేది గుర్తించి అందుకు అదనంగా మరింత ఇచ్చే విధంగా కొందరు వ్యూహరచన చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్లు చేస్తూ ఓటు వేయడానికి రమ్మని అభ్యర్థిస్తున్నారు. మొత్తంగా గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌ను చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement