అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది వెంటనే స్పందించాలని అత్యవసర సంచార వాహన సేవల జిల్లా అధికారి షేక్ జాన్ షాహిద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని జీవీకే ఈఎంఆర్‌ఐ 108 అత్యవసర సేవలు, 102 అమ్మఒడి సేవలు, 1962 పశు సంచార సేవల వాహనాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంచార వాహన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందించడం సిబ్బంది ప్రథమ కర్తవ్యం అన్నారు. జిల్లాలో 19 అత్యవసర 108 అంబులెన్సు సేవలు, 14 అమ్మ ఒడి సేవల వాహనాలు, 4 పశు సంచార వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటి సేవల వినియోగంలో ఆశ వర్కర్లు ప్రధాన పాత్ర పోషించి మాతాశిశు మరణాలను తగ్గించేందుకు చొరవ చూపాలని సూచించారు.


